అమెరికాలో డెల్టా, ఒమిక్రాన్ వేరియంట్లు రెండూ కలిసి డెల్మిక్రాన్ డబుల్ వేరియంట్‌గా మారి అమెరికా వాసులను భయాందోళనకు గురిచేస్తోంది. డెల్టా, ఒమిక్రాన్ వేరియంట్ల స్పైక్ ప్రొటీన్ల మ్యూటేషన్లతో ఏర్పడిన డెల్మిక్రాన్.. చాప కింద నీరులా వ్యాపిస్తోందని అమెరికా వైద్య ఆరోగ్య శాఖ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇలాంటి డెల్మిక్రాన్ కేసులు అమెరికా, బ్రిటన్‌లో విపరీతంగా బయటపడుతున్నాయి. రోజువారీ కేసులు లక్షకు పైగా నమోదు కావడానికి డెల్మిక్రాన్ కారణమని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అమెరికాలో గడిచిన 24 గంటల్లో 1,97,856 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 747 మంది చనిపోయారు.
దీంతో ఇప్పటి వరకు కరోనా బారినపడిన వారి సంఖ్య 5,29,86,307కు చేరుకుంది. మృతులు 8,37,671కు చేరుకున్నారు. గడిచిన 24 గంటల్లో 29,257 మంది రికవరీ అయ్యారు. దీంతో ఇప్పటి వరకు కరోనాను జయించిన వారి సంఖ్య 4,09,94,250కు చేరుకుంది.
ప్రస్తుతం అమెరికాలో 1,11,54,386 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 16,167 మంది పరిస్థితి విషమంగా ఉంది. 2021, జనవరి తరువాతే ఇంత భారీ కేసులు నమోదవుతున్నాయి. అమెరికాలో ఒమిక్రాన్ బారిననపడే వారి సంఖ్య కూడా 73 శాతానికి పెరిగింది.
చాలా మంది ఈనాటికి కూడా వ్యాక్సిన్లు వేయించుకోవడానికి ఆసక్తి చూపించడం లేదు. దీంతో కరోనా కొత్త వేరియంట్లు దాడి చేస్తున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఇక బ్రిటన్ లో రోజుకు లక్షన్నరకు పైగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ప్రతీ 10 మందిలో ఒకరు కరోనా బారినపడుతున్నారు. గడిచిన 24 గంటల్లో 1,22,186 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇంత భారీ కేసులు నమోదవుతుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
మరికొన్ని రోజుల్లో కేసుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశాలు ఉన్నాయని బ్రిటన్ వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. డిసెంబర్ 16 నాటికి లండన్‌లో ప్రతీ 20 మందిలో ఒకరు కరోనా బారినపడ్డారు. నాలుగు రోజుల వ్యవధిలోనే.. ఆ సంఖ్య రెట్టింపు అయ్యింది.
గడిచిన 24 గంటల్లో 137 మంది చనిపోయారు. దీంతో ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 3,02,269కు చేరుకుంది. ఇప్పటి వరకు కరోనా బాధితుల సం ఖ్య 1,18,91,292కు చేరుకున్నాయి. 99,61,369 మంది కరోనా నుంచి కోలుకున్నారు.