వైఎస్ వివేకా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాష్ రెడ్డికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ముందస్తు బెయిల్ పై అవినాష్ రెడ్డి దాఖలు చేసిన పిటీషన్ పై మంగళవారం కోర్టు విచారణ జరిపింది. ఈ సందర్బంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.
ఈనెల 25న హైకోర్టు వెకేషన్ బెంచ్ కు వెళ్లాలని అవినాష్ రెడ్డికి కోర్టు సూచించింది. ఎల్లుండి అవినాష్ ముందస్తు బెయిల్ పిటీషన్ పై హైకోర్టు విచారణ జరిపి తీర్పు ఇవ్వాలని సుప్రీం ఆదేశించింది. తెలంగాణ హైకోర్టు వెకేషన్ బెంచ్ వాదనలు వినేంత వరకు తనను అరెస్ట్ చేయకుండా సీబీఐకి ఆదేశాలు ఇవ్వాలనే విన్నపాన్ని సుప్రీం తిరస్కరించింది. అరెస్ట్ చేయకుండా సీబీఐని ఇప్పుడు ఆదేశించలేమని కోర్టు స్పష్టం చేసింది. దీనితో అవినాష్ రెడ్డికి షాక్ తగిలినట్లైంది.
మరోవైపు విచారణ సందర్భంగా సీబీఐ నోటీసులకు ఎందుకు స్పందించడం లేదని, విచారణకు ఎందుకు హాజరు కావడం లేదని అవినాశ్ తరపు లాయర్ ను సుప్రీంకోర్టు ప్రశ్నించింది. అవినాశ్ ముందస్తు బెయిల్ పిటిషన్ విషయంలో జోక్యం చేసుకోవడానికి సుప్రీంకోర్టు తిరస్కరించడంతో ఇప్పుడు సీబీఐ అధికారలు ఏం చేస్తారనే ఉత్కంఠ నెలకొంది.
ఇంకోవైపు సుప్రీంకోర్టు విచారణ సందర్భంగా సీబీఐ తరపున న్యాయవాది హాజరుకాకపోవడం గమనార్హం. మరి సుప్రీం ఆదేశాలతో సీబీఐ ఎలాంటి స్టెప్ తీసుకుంటారనేది ప్రస్తుతానికి సస్పెన్సే. కాగా ఈనెల 16, 19న రెండుసార్లు అవినాష్ రెడ్డికి సీబీఐ నోటీసులు ఇవ్వగా..పలు కారణాలతో విచారణకు హాజరు కాలేదు.
దీనితో సీబీఐ అధికారులు సీరియస్ గా తీసుకున్నారు. ప్రస్తుతం అవినాష్ రెడ్డి తన తల్లిని చేర్పించిన కర్నూల్ లోని విశ్వభారతి ఆసుపత్రిలోనే చాతినొప్పితో చేరారు. ఈ పరిణామాల నేపథ్యంలో తాను ఈనెల 27 వరకు విచారణకు రాలేనని అవినాష్ సీబీఐకి లేఖ రాశారు. ఆ తరువాత సుప్రీంకు వెళ్లినా కూడా ఊరట దక్కలేదు.