కర్ణాటక ఎన్నికలలో కాంగ్రెస్ విజయం సాధించడంలో కీలక పాత్ర వహించిన ఉపముఖ్యమంత్రి, కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ చాలా `రఫ్ అండ్ టాప్’ నేతగా పేరొందారు. రాజకీయ ప్రత్యర్థులను మట్టికరిపించేందుకు ఎంతవరకైనా వెడతాడని ప్రతీతి. అయితే ముఖ్యమంత్రి పదవికోసం తీవ్రంగా ప్రయత్నించి, ఉపముఖ్యమంత్రి పదవితో సరిపెట్టుకోవాల్సి వచ్చిన తర్వాత ఆయనలో మార్పు వచ్చినట్లు కనిపిస్తోంది.
సాధారణంగా కర్ణాటకలో ద్వేషరాజకీయాలు తక్కువ. రాజకీయంగా ఎంతటి తీవ్ర విబేధాలు ఉన్నప్పటికీ వ్యక్తిగతంగా సామరస్య సంబంధాలను నెరుపుతూ ఉంటారు. అదేవిధంగా ఉపముఖ్యమంత్రి హోదాలో ద్వేషరాజకీయాలకు స్వస్తి పలికి, అందరితో కలిసి మెలిసి పనిచేయాలని నిర్ణయించిన్నటు కనిపిస్తున్నది.
సోమవారం నుండి ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలలో బిజెపి, జేడీఎస్ సభ్యులను ఆప్యాయంగా పలకరించడం, వారితో కలిసిపోవడం అందరిని ఆకట్టుకొంటోంది. తన మీద కనకపుర నియోజక వర్గంలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన మాజీ బిజెపి మంత్రి ఆర్. అశోక్ ను నవ్వుతూ పలకరించి కాంగ్రెస్ వారందరికీ షాక్ ఇచ్చారు. అశోక్ పై లక్ష 20 వేల ఆధిక్యతతో గెలుపొందారు.
పక్కనే మాజీ సీఎం బసవరాజ్ బోమ్మయ్ ఉండటంతో ఆయనతో పాటు అశోక్ తో చాలా సేపు మాట్లాడిన డీకే శివకుమార్ వారితో నవ్వుతూ ఫోటోలు తీసుకున్నారు. ఇక అశోక్ భుజం మీద చెయ్యి వేసి క్లోజ్ ఫ్రెండ్స్ లాగా డీకే శివకుమార్ ఫోటోలు తీసుకున్నారు. అశోక్, డీకే శివకుమార్, మాజీ సీఎం బసవరాజ్ బోమ్మయ్ కలిసి విధానసౌధలో తీసుకున్న ఫోటోలు వైరల్ అయ్యాయి.
అంతకు ముందు, బెంగళూరులోని పద్మనాభనగర్ లో నివాసం ఉంటున్న జేడీఎస్ పార్టీ దళపతి, మాజీ ప్రధాని హెచ్ డీ. దేవేగౌడ ఇంటికి వెళ్లిన డీకే శివకుమార్ ఆయన దగ్గర ఆశీర్వాదం తీసుకున్నారు. మాజీ ప్రధాని దేవేగౌడ ఆశీస్సులు తీసుకున్న డీకే శివకుమార్ ఆయనతో ఫోటోలకు ఫోజులు ఇచ్చి కొంత సేపు ముచ్చటించారు.