ఒక వంక రాబోవు రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ నేతలు ఉమ్మడిగా పనిచేసే విధంగా చేసేందుకు ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, మాజీ ఉపముఖ్యమంత్రి సచిన్ పైలట్ కలిసి పనిచేసే విధంగా చేయాలని కాంగ్రెస్ అధిష్టానం ప్రయత్నం చేస్తుంటే ఈ ఇద్దరి వ్యవహారం మాత్రం ఎవరిదారి వారిదిగా ఉంది.
స్వయంగా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే, పార్టీ కీలక నేత రాహుల్ గాంధీ చొరవ తీసుకొని వారిద్దరితో కలిపి సోమవారం సాయంత్రం నాలుగైదు గంటలసేపు సమాలోచనలు జరిపారు. ఆ తర్వాత వారిద్దరూ కలిసి పార్టీ గెలుపుకోసం పనిచేసేందుకు ఒప్పుకున్నారని అంటూ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసి వేణుగోపాల్ ప్రకటించారు.
అయితే, మంగళవారం గెహ్లాట్ మీడియాతో మాట్లాడుతూ `సచిన్ కాంగ్రెస్ లో ఉంటె కదా..’ అంటూ నర్మగర్భంగా మాట్లాడారు. రాజస్థాన్ కాంగ్రెస్ మాజీ చీఫ్ సచిన్ పైలట్‌తో కలిసి పని చేస్తారా? అని విలేకర్లు అడిగినపుడు గెహ్లాట్ స్పందిస్తూ, సచిన్ పైలట్ కాంగ్రెస్ పార్టీలోనే ఉంటే, ఆయనతో కలిసి పని చేస్తానని పరోక్షంగా పేర్కొనడం గమనార్హం.
సచిన్ పైలట్‌తో మీకు విభేదాలు ఎందుకు అని మీడియా ప్రశ్నించగా.. ‘ఆయన పార్టీలోనే ఉంటే నాతో ఎందుకు కలిసి పని చేయడం లేదు..?’ అని గెహ్లాట్ ఎదురు ప్రశ్నించారు. గత మూడు పర్యాయాలుగా తాను సీఎంగా ఉంటున్నానని, ఇంకా తనకు పదవుల మీద ఆశ దేనికని, తనకు పదవులు ముఖ్యం కాదని అశోక్ గెహ్లాట్ వ్యాఖ్యానించారు.
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించాలన్నదే అధిష్ఠానం అభిమతమని, అందుకోసం పని చేయడం తన బాధ్యత అని ఆయన చెప్పారు. ‘నువ్వు ఎదుటి వాళ్లను నమ్మితే ఎదుటి వాళ్లు నిన్ను నమ్ముతారని’ సచిన్ పైలట్‌ను ఉద్దేశించి గెహ్లాట్ ఘాటుగా స్పందించారు.
‘రాజస్థాన్‌లో మళ్లీ మన ప్రభుత్వం ఏర్పాటైతే అందరూ కలిసి వస్తారు. పార్టీకి నమ్మకస్తులుగా ఉండేవాళ్లకు ఏదో ఒకరోజు తప్పకుండా అవకాశం వస్తుందని, అప్పటి వరకు సహనంతో వేచి ఉండాలని సోనియాగాంధీ గతంలో చెప్పారు. నువ్వు కూడా నీకు అవకాశం వచ్చేదాక పార్టీకి నమ్మకస్తుడిగా ఉండు’ అని సచిన్ పైలట్‌కు గెహ్లాట్ చురకలు అంటించారు.
కాంగ్రెస్ సోమవారం పొద్దుపోయాక వెల్లడించిన వివరాల ప్రకారం, పైలట్, గెహ్లాట్ రానున్న శాసన సభ ఎన్నికల్లో కలిసికట్టుగా పోరాడాలని నిర్ణయించారు. తమ మధ్య సమస్యల పరిష్కార బాధ్యతను పార్టీ అధిష్ఠానానికి వదిలిపెట్టారు. మాజీ సీఎం వసుంధర రాజే నేతృత్వంలోని గత బీజేపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి, ప్రభుత్వ ఉద్యోగాల నియామక పరీక్ష పత్రాల లీకేజీ అంశాలపై 15 రోజుల్లోగా చర్యలు తీసుకోకపోతే తన ఆందోళనను ఉధృతం చేస్తానని సచిన్ పైలట్ సీఎం గెహ్లాట్ ప్రభుత్వానికి అల్టిమేటం జారీచేశారు. ఈ గడువు నేటితో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఇరువురు నేతలో పార్టీ పెద్దలు సోమవారం సాయంత్రం సమావేశమయ్యారు.
.