తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలను కేంద్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోందని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ జి. మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఆజాదీకా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా హైదరాబాద్ గోల్కొండ కోటలో జూన్ 2, 3 తేదీల్లో కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు చెప్పారు. వివిధ రాజ్భవన్లలో కూడా తెలంగాణ ఆవిర్భావ వేడుకలు జరుపుతున్నట్లు తెలిపారు.
రానున్న రోజుల్లో రాష్ట్రాల ఆవిర్భావ వేడుకలను దేశ వ్యాప్తంగా ఉన్న రాజ్‌భవన్ లలో జరపనున్నట్లు కిషన్ రెడ్డి వెల్లడించారు. లక్షలాది మంది తెలంగాణ ఉద్యమంలో భాగస్వామ్యం అయ్యారని. అందుకే తెలంగాణ సాకారమైందని పేర్కొన్నారు. బీజేపీ చిన్న రాష్ట్రాలకు అనుకూలమని చెప్పారు. తెలంగాణ అభివృద్ధి, సంక్షేమం కోసం రంగాల వారీగా గత తొమ్మిదేళ్లలో కేంద్రం ప్రభుత్వం ఏం చేసిందో ప్రకటిస్తామని తెలిపారు.
రెండు తెలుగు రాష్ట్రాల మధ్య సమస్యల పరిష్కారం కోసం కేంద్రం అనేకసార్లు సమావేశాలు నిర్వహించిందని, సామరస్యపూర్వకంగానే సమస్యలు పరిష్కారమవుతాయని తెలిపారు. ఢిల్లీ ఏపీ భవన్ విభజనపై చర్చలు జరుగుతున్నట్లు తెలిపారు.
కాగా, బీజేపీలో చేరిన ఎవరూ బయటికి వెళ్లరని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ కుట్రలు చేస్తున్నాయని మండిపడ్డారు. తెలంగాణలో బీజేపీ మరింత బలపడుతుందని ధీమా వ్యక్తం చేశారు. పార్టీలో నాయకులు చేరితే ప్రభుత్వాలు ఏర్పడవని.. ప్రజలు మార్పు కోరుకుంటేనే ప్రభుత్వాలు ఏర్పడతాయని కిషన్ రెడ్డి చెప్పారు.
కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత డీలా పడలేదని, బీజేపీ నిరాశ, నిస్పృహకి లోనయ్యే పార్టీ కాదని స్పష్టం చేశారు. అనేకమంది నాయకులు బీజేపీలో కొత్తగా చేరబోతున్నారని చెబుతూ కాంగ్రెస్ బలంగా ఉండాలనే బీజేపీపై బీఆర్ఎస్ కుట్రలు చేస్తోందని మండిపడ్డారు.