నీతి ఆయోగ్ ప్రారంభించిన నాల్గవ ఆరోగ్య సూచిక ప్రకారం, పెద్ద రాష్ట్రాలలో మొత్తం ఆరోగ్య సేవల పరంగా కేరళ మరోసారి అగ్రస్థానంలో నిలిచింది. వరుసగా నాలుగు ఏళ్లలో కూడా కేరళ మొదటి స్థానాల్లో ఉండటం గమనార్హం.
దేశంలో జనాభా రీత్యా పెద్దరాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ చివరలో ఉంది. 2019-20 సంవత్సరానికి రూపొందించిన హెల్త్ ఇండెక్స్ నాల్గవ రౌండ్ లో తమిళనాడు, తెలంగాణ వరుసగా రెండు, మూడవ స్థానాలలో ఉన్నాయి.
బీహార్, మధ్యప్రదేశ్ చివరి నుండి వరుసగా, రెండవ, మూడవ స్థానాలలో ఉన్నాయి. అయితే అంతకు ముందు ఏడాది (2018-19)తో పోల్చితే 2019-20లో ఉత్తర ప్రదేశ్ పనితీరు అద్భుతంగా ఉన్నట్లు ఈ నివేదిక స్పష్టం చేసింది.
చిన్న రాష్ట్రాలలో, మిజోరాం మొత్తం పనితీరులో అత్యుత్తమంగా ఉండగా, కేంద్ర పాలిత రాష్ట్రాలలో ఢిల్లీ, జమ్మూ కాశ్మీర్ మొత్తం పనితీరులో అట్టడుగున ఉన్నాయి. అయితే పెరుగుతున్న పనితీరు పరంగా అగ్రగామిగా నిలిచాయి. మొత్తం పారామితుల పరంగా వరుసగా నాల్గవ రౌండ్లో కేరళ అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిందని నివేదిక ఎత్తి చూపింది.
నివేదిక ప్రకారం, 2019-20లో అత్యుత్తమ పనితీరు ప్రదర్శించిన రాష్ట్రాలలో కేరళ, తమిళనాడు వరుసగా మొదటి రెండు స్థలంలో ఉన్నప్పటిగే, అంతకు ముందు సంవత్సరంతో పోల్చుకొంటే పనితీరులో మెరుగుదల ప్రదర్శించిన రాష్ట్రాలలో వరుసగా 12, 8వ స్థానాలలో ఉన్నాయి.
మొత్తం పనితీరుతో పాటు ఇంక్రిమెంటల్ పనితీరు పరంగానూ తెలంగాణ మెరుగైన ప్రదర్శన కనబరిచి, రెండు సందర్భాల్లోనూ మూడో స్థానంలో నిలిచింది. రెండింటిలోనూ రాజస్థాన్ బలహీనంగా ఉంది.
చిన్న రాష్ట్రాల విషయానికొస్తే, మిజోరాం, త్రిపుర బలమైన మొత్తం పనితీరును నమోదు చేశాయి. అదే సమయంలో మెరుగవుతున్న పనితీరులో మెరుగుదలలను చూపించాయి.
ఆరోగ్య సూచికను ఆరోగ్య ఫలితాలు, పాలన, సమాచారంలకు సంబంధించిన కీలక ఇన్పుట్ల ఆధారంగా రూపొందించారు.
నివేదికను విడుదల చేస్తూ, నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్, “రాష్ట్రాలు రాష్ట్ర ఆరోగ్య సూచీ వంటి సూచికలను గుర్తించడం ప్రారంభించాయి. వాటిని తమ విధాన రూపకల్పన, వనరుల కేటాయింపులో ఉపయోగించుకోవడం ప్రారంభించాయి” అని సంతోషం వ్యక్తం చేశారు. ఈ నివేదిక పోటీ, సహకార సమాఖ్య రెండింటికీ ఉదాహరణ అని చెప్పారు.
ప్రపంచ బ్యాంకు సాంకేతిక సహాయంతో ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ సహకారంతో ఈ నివేదికను తయారు చేశారు. ఈ వార్షిక నివేదిక అంశాలను జాతీయ ఆరోగ్య మిషన్ కింద అందిస్తున్న ప్రోత్సాహకాలతో అనుసంధానం చేయనున్నారు.