రైతులకు నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ ఏడాది ఖరీఫ్ లేదా వానాకాలం పంటలకు కనీస మద్దతు ధరల (ఎంఎస్పీ) పెంపునకు ఆమోదం తెలిపింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో బుధవారం జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఎంఎస్పీ అనేది ప్రభుత్వం రైతుల నుండి పంటలను కొనుగోలు చేసే కనీస ధరను సూచిస్తుంది. ధరల పతనానికి వ్యతిరేకంగా రైతులకు ఆర్థిక భద్రతను అందిస్తుంది. మార్కెట్లో అనూహ్య ఒడిదుడుకుల నేపథ్యంలో రైతుల ప్రయోజనాలను పరిరక్షించేందుకు ఎంఎస్పీ పెంపునకు కేంద్రం ఆమోదం తెలపడం కీలకమైన చర్యగా భావిస్తున్నారు.
ఎంఎస్పీ అనేది నిర్దిష్ట వ్యవసాయ ఉత్పత్తులకు ప్రభుత్వం నిర్ణయించిన కనీస ధర. ఎంఎస్పీ పెంపుకు సంబంధించిన కేబినెట్ నిర్ణయాలను కేంద్రమంత్రి పీయూష్ గోయల్ మీడియాకు వివరించారు. రిటైల్ ద్రవ్యోల్బణం తగ్గుతున్న నేపథ్యంలో పంటలకు మద్దతు ధర పెంచడం వల్ల అన్నదాతలకు ప్రయోజనం ఉంటుందని స్పష్టం చేశారు. 2023 – 2024 ఖరీఫ్ సీజన్ నుంచి ఈ మద్దతు ధర పెంపు ఉంటుందని వెల్లడించారు.
క్వింటాల్ సాధారణ వరికి మద్దతు ధరను రూ.143 పెంచింది. దీంతో వరి క్వింటాల్ ధర రూ.2183కు చేరుకుంది. గ్రేడ్ ఏ వరికి రూ.163 పెంచడంతో రూ.2203కు చేరుకుంది. గత ఏడాదితో పోలిస్తే కనీస మద్దతు ధరను ఎక్కువగా పెంచారు.
పెసరకు అత్యధిక ఎంఎస్పీని పెంచారు. గత ఏడాది క్వింటాల్ పెసర ధర రూ.7755కాగా, ఈసారి 10.4 శాతం పెంచడంతో రూ.8558కి చేరుకుంది. హైబ్రిడ్ జోన్న క్వింటాల్ రూ.3180, జొన్న రూ.3225, రాగి రూ.3846, సజ్జలు రూ.2500, మొక్కజొన్న రూ.2090, పొద్దు తిరుగుడు రూ.6760, వేరుశనగ రూ.6377, సోయాబీన్ రూ.4600, పత్తి మధ్యస్థాయి పింజ రూ.6620, పత్తి పొడవు పింజ రూ.7020 చొప్పున నిర్ణయించింది.