బిపార్జోరు తుఫాను రానున్న 24 గంటల్లో మరింత బలపడి ఉత్తర-ఈశాన్య దిశగా కదులుతుందని భారత వాతావరణ శాఖ (ఐఎండి) శనివారం వెల్లడించింది. ఈ తుఫాను ప్రస్తుతం గోవాకు పశ్చిమాన 690 కిలోమీటర దూరంలో, ముంబైకి పశ్చిమ – నైరుతి దిశలో 640 కిలోమీటర్ల దూరంలో, గుజరాత్‌లోని పోర్‌బందర్‌కి 640 కిలోమీటర్ల దూరంలో దక్షిణ నైరుతి దిశలో ఉన్నట్లు ఐఎండి వెల్లడించింది.
ఈ తుఫాను కారణంగా గంటకు 145 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీయనున్నట్లు ఐఎండి పేర్కొంది. దీంతో తీర ప్రాంతాలైన కర్ణాటక, గోవా, మహారాష్ట్రల్లో భారీ వర్షాలు, ఈదురు గాలులు వీచే అవకాశముందని ఐఎండి హెచ్చరించింది.
ఈ తుఫాను వల్ల అరేబియా సముద్ర తీరంలోని గుజరాత్ వల్సాద్‌లోని ప్రసిద్ధ పర్యాటక ప్రదేశమైన తితాల్ బీచ్‌ని జూన్ 14 వరకు మూసివేయనున్నట్లు వల్సాద్ తహసీల్దార్ టిసి పటేల్ మీడియాకు వెల్లడించారు.
ఈ సందర్భంగా పటేల్ మీడియాతో మాట్లాడుతూ ‘తుఫాను కారణంగా మేము మత్స్యకారులను సముద్రంలోకి వెళ్లవద్దని చెప్పాము. వారందరూ తిరిగి వచ్చారు. అవసరమైతే సముద్ర తీరంలోని గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తాము. వారికి షెల్టర్లను ఏర్పాటు చేస్తాము. పర్యాటకుల రద్దీ కారణంగా తితాల్ బిచ్ని కూడా జూన్ 14 వరకు మూసివేయనున్నాం’ అని ఆయన తెలిపారు.
కాగా, గుజరాత్, కర్ణాటక, లక్షద్వీప్ తీరాల సముద్రంలో మత్స్యకారులను వేటకు వెళ్లవద్దని ఐఎండి సూచించింది. ఇక ఈ తుఫాను కారణంగా కేరళలోని ఎనిమిది జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించింది. తుఫాను గుజరాత్‌లోని పోర్బందర్ జిల్లాకు దక్షిణ నైరుతి దిశలో 640 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది.
సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారులు తీరిగి రావాలని అధికారులు కోరారు. ఈ సందర్భంగా దూర హెచ్చరిక సిగల్ కట్ చేయాలని ఓడరేవులకు హెచ్చరికలు జారీ అయ్యాయి. ‘ఈ తుఫాను ఆదివారం లేదా సోమవారం దక్షిణ గుజరాత్‌కు చేరుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం మేము అలర్ట్మోడ్లో ఉన్నాం’ అని తెలిపారు.
ప్రధాన కార్యాలయాన్ని అధికారులు విడిచిపెట్టవద్దని సూచించారు. ఇప్పటికే ఎస్డిఆర్ఎఫ్ బృందాలను సిద్ధంగా ఉన్నాయి. అవసరమతే తీర ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తామని సూరత్ కలెక్టర్ బికె వాసవ మీడియాకు వెల్లడించారు.
అలాగే అహ్మదాబాద్ ఐఎండి డైరెక్టర్ మనోరమా మోహంతి మీడియాతో మాట్లాడుతూ.. ”బిపార్జారు తుఫాను కారణంగా జూన్ 10,11,12 తేదీల్లో 45 నుంచి 55 లేదా అంతకుమిచి 65 కిలోనాట్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉంది. ఈ తుఫాను దక్షిణ గుజరాత్ సౌరాష్ట్రతో సహా కోస్తా ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు, ఉరుములతో కూడిన వర్షాలు పడనున్నాయి’ అని తెలిపారు.