కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీకి చెందిన లోక్‌సభ సభ్యుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ తమపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు మహిళా రెజర్లు చేసిన ఫిర్యాదులపై ఢిల్లీ పోలీసులు గురువారం ఛార్జ్‌షీట్‌ను నమోదు చేశారు. పలు సెక్షన్ల కింద ఈ కేసులు పెట్టారు.
ఉత్తరప్రదేశ్‌లోని కైసర్‌గంజ్ లోక్‌సభకు ప్రాతినిథ్యాన్నివహిస్తోన్నారు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ వరుసగా మూడుసార్లు ఆయన ఇదే నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. ఆయనను రెజ్లింగ్ ఫెడరేషన్ అధ్యక్షుడిగా నామినేట్ చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఈ క్రమంలో మహిళా రెజ్లర్లపై లైంగిక దాడులకు పాల్పడ్డారనే ఆరోపణలు బ్రిజ్ భూషణ్‌పై వెల్లువెత్తాయి.
ఆయనపై తక్షణ చర్యలు తీసుకోవాలంటూ భారత మహిళా రెజ్లర్లు రోడ్డెక్కిన విషయం తెలిసిందే. రోజుల తరబడి ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసన కొనసాగించారు. వినేష్ ఫొగట్, బజరంగ్ పునియా, సాక్షి మాలిక్, సంగీత ఫొగట్, సత్యవ్రత్ కడియన్, సోమ్‌వీర్ రాఠీ, జితేందర్ కిన్హా తమ నిరసనలను కొనసాగించారు.
మహిళా ఖాఫ్ పంచాయతీని కూడా నిర్వహించడానికి సమాయాత్తం అయ్యారు అప్పట్లో. వారి నిరసనలు, ఆందోళనలకు రైతు సంఘాలు కూడా మద్దతు ప్రకటించాయి. పంజాబ్, హర్యానా సహా ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో మహిళలు, రైతులు ఢిల్లీకి చేరుకుని, వారికి అండగా నిలిచారు.
మహిళా రెజ్లర్లకు న్యాయం జరగాలంటూ సచిన్ టెండుల్కర్, 1983 వరల్డ్ కప్ గెలిచిన టీమిండియా జట్టు సభ్యులు, పలువురు క్రీడారంగ ప్రముఖులు గళమెత్తారు. ఆందోళన చేస్తున్న వారితో కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా, క్రీడా మంత్రి అనురాగ్ ఠాకూర్ ఇటీవల చర్చలు జరిపి, సత్వరం చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో వారు నిరసనలను విరమించారు.
ఈ క్రమంలో బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై తాజాగా ఢిల్లీ పోలీసులు తమ ఛార్జిషీట్‌ను నమోదు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఢిల్లీ రోజ్ అవెన్యూ కోర్టులో దాన్ని దాఖలు చేశారు. భారత శిక్షా స్మృతిలోని సెక్షన్ 354, 354 ఏ, 354డీ కింద ఛార్జిషీట్‌ను రూపొందించారు. భారత రెజర్ల సమాఖ్య మాజీ అసిస్టెంట్ కార్యదర్శి వినోద్ తోమర్ పేరును కూడా ఇందులో జత చేశారు.
కాగా, మైనర్‌ను లైంగికంగా వేధించినట్లు బ్రిజ్ భూషణ్‌పై స్టార్ రెజ్లర్లు ఫిర్యాదు చేయగా, మైనర్ రెజ్లర్ తండ్రి ఉపసంహరించుకోవడంతో పోక్సో చట్టం ప్రకారం దాఖలు చేసిన కేసును రద్దు చేయాలని కోర్టును ఢిల్లీ పోలీసులు కోరారు. దీనిపై విచారణ జూలై 4న జరుగుతుంది. మైనర్‌ను బ్రిజ్ వేధించినట్లు ఆధారాలు లేవని తమ ఛార్జిషీట్లో తెలిపారు.