అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల నేరచరిత్రను ప్రచురించడంలో విఫలమైన రాజకీయ పార్టీలపై చర్యలు తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ కోరింది. సుప్రీంకోర్టు మార్గదర్శకాలను అనుసరించి కేంద్ర, రాష్ట్ర ఎన్నికల స్థాయిల్లో రాజకీయ పార్టీలు తమ వెబ్సైట్లో స్వభావంతో సహా పెండింగ్లో ఉన్న క్రిమినల్ కేసుల వివరాలను పబ్లిస్ చేయడం తప్పనిసరని పేర్కొంది.
పార్టీలు ఉన్న అభ్యర్థులకు సంబంధించిన సవివరమైన సమాచారాన్ని అప్లోడ్ చేయాలని, నేరచరితులైన అభ్యర్థులను ఎంపిక చేయడానికి కారణాలను కూడా తెలియజేయాల్సి ఉంటుందని గుర్తు చేసింది. అదే సమయంలో నేర చరిత్ర లేని ఇతర వ్యక్తులను అభ్యర్థులుగా ఎందుకు ఎంపిక చేయలేకపోవడాన్ని కూడా తెలియజేయాల్సి ఉంటుంది.
అయితే, గతంలో అభ్యర్థులపై పెండింగ్లో ఉన్న క్రిమినల్ కేసుల వివరాలు, వారి ఎంపికకు గల కారణాలతో పాటు జాబితాను పబ్లిష్ చేయడంలో విఫలమైనందుకు పలు పార్టీలను సుప్రీంకోర్టు మందలించింది. 2020 బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన పది రాజకీయ పార్టీలకు సుప్రీంకోర్టు ఆదేశాలు పాటించనందుకు జరిమానా సైతం విధించింది.
ఈ క్రమంలో ఈ నేపథ్యంలో అభ్యర్థులపై ఉన్న క్రిమినల్ కేసులు ప్రదర్శించని పార్టీలపై చర్యలు తీసుకోవాలని ఏడీఆర్ డిమాండ్ చేస్తున్నది. 2023లో జరిగిన త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్, కర్ణాటకతో పాటు గతేడాది 2022లో గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్, పంజాబ్, 2021 పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అసోంలు ఎన్నికలు జరిగాయి.
దాంతో పాటు కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలో సైతం ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఎన్నికల సమయంలో ఇలాంటి లోపాలను వెంటనే సుప్రీంకోర్టుకు నివేదించాలని, ఉల్లంఘనకు జరిమానా విధించే అంశాన్ని కూడా ఎన్నికల కమిషన్ పరిశీలించాలని లేఖలో ఏడీఆర్ కోరింది.