ప్రపంచానికి భారత్ అందించిన యోగా నిజంగా విశ్వవ్యాప్తమని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. దీనికి కాపీరైట్గానీ, పేటెంట్గానీ, రాయల్టీగానీ.. ఏమీ లేవని చెప్పారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా న్యూయార్క్‌లోని ఐరాస ప్రధాన కార్యాలయంలో బుధవారం నిర్వహించిన కార్యక్రమానికి ప్రధాని మోదీ నేతృత్వం వహించారు.
కార్యక్రమం అనంతరం ‘నమస్తే’ అంటూ తన ప్రసంగాన్ని ప్రారంభించిన మోదీ ఈ వేడుకలకు హాజరయ్యేందుకు సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ‘‘యోగా భారతదేశం నుంచి వచ్చింది. దీనికి కాపీరైట్, పేటెంట్, రాయల్టీ ఏమీ లేవు. మీ వయసు, లింగం, ఫిట్నెస్ స్థాయికి అనుగుణంగా ఉంటుంది. యోగా నిజంగా విశ్వజనీనమైనది” అని పేర్కొన్నారు.
యోగాకు యావత్ ప్రపంచం మద్దతు పలకడం అద్భుతమని చెప్పారు. అంతకుముందు మోదీ ఒక వీడియో సందేశం విడుదల చేశారు. ‘‘యోగా ద్వారా మనలోని వైరుధ్యాలు, అడ్డంకులు, ప్రతిఘటనలను తొలగించుకోవాలి’’ అని అందులో పిలుపునిచ్చారు.
కాగా, ఐక్యరాజ్యసమితిలో ఏర్పాటు చేసిన వందలాది మ్యాట్లపై ఔత్సాహికులు యోగా చేశారు. ఈ కార్యక్రమంలో ఐక్యరాజ్యసమితి ఉన్నతాధికారులు, రాయబారులు, సభ్య దేశాల ప్రతినిధులు, 180 దేశాలకు చెందిన ప్రముఖులు పాల్గొన్నారు. దీంతో.. ‘అత్యధిక దేశాలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్న యోగా కార్యక్రమం’గా ఐరాసలో నిర్వహించిన కార్యక్రమం గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించింది.
ప్రపంచదేశాలతోపాటు భారత్‌లోని అనేక ప్రాంతాల్లోనూ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని క్రమశిక్షణగా జరుపుకొన్నారు. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు యోగాసనాలు వేశారు. ఐఎన్ఎస్ విక్రాంత్, వందేభారత్ ఎక్స్‌ప్రెస్, చారిత్రక ప్రదేశాలు, ఇళ్, స్టూడియోలు, ఆఫీసులు.. ఇలా అన్నిచోట్లా లక్షలాది మంది యోగాసనాలు వేశారు.
యోగా అనేది భారతదేశం ప్రపంచానికి ఇచ్చిన గొప్ప బహుమతి అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలిపారు. యోగా చేస్తున్న ఫొటోను ఆమె ట్విటర్లో షేర్ చేశారు. గుజరాత్‌లోని సూరత్ పట్టణంలో 1.53 లక్షల మంది ఒకేరోజు ఒకేచోట యోగా నిర్వహించారు. ఇది గిన్నిస్ వరల్డ్ రికార్డు అని గుజరాత్ మంత్రి హర్ష సంఘవి తెలిపారు.
విమాన వాహక యుద్ధనౌక ఐఎన్ఎస్ విక్రాంత్‌లో వందలాది మంది నేవీ సిబ్బందితో కలిసి రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ యోగాసనాలు వేశారు. నౌకాదళాధిపతి అడ్మిరల్ ఆర్ హరికుమార్ కూడా పాల్గొన్నారు. భారత ఆర్మీ సిబ్బంది దేశవ్యాప్తంగా 100 ప్రాంతాల్లో యోగా చేశారు.