దేశభక్త ప్రజాస్వామ్య కూటమి (పిడిఎ) పేరుతో బిజెపియేతర ప్రతిపక్షాల కూటమి ఉనికిలోకి వచ్చేందుకు కసరత్తు జరుగుతుంది. గత వారం పాట్నాలో నితీష్ కుమార్ సారధ్యంలో జరిగిన భేటీలో ఈ విషయమై ప్రాధమిక చర్చలు జరుగగా, వచ్చే నెల సిమ్లాలో జరుగనున్న భేటీలో ఈ పేరు ఖరారయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.
ఎడమెఖం పెడమొఖంగా ఉన్న విపక్షాలను ఒకేతాటిపైకి తీసుకువచ్చేందుకు వచ్చే ఎన్నికలలో బిజెపిని సంఘటితంగా ఎదుర్కొనేందుకు నిర్ణయించారు. ఈ దశలో దేశభక్తియుత ప్రజాస్వామ్య కూటమి చట్రం వెలుగులోకి రానుందని వెల్లడైంది. పాట్నాలో జరిగిన విపక్ష సదస్సులో 15 పార్టీలకు చెందిన 32 మంది ప్రముఖ నేతలు ఒకచోట చేరారు.
ఇంతకు ముందు కాంగ్రెస్ ఆధ్వర్యంలో యుపిఎ అధికారంలోకి వచ్చింది. దేశంలోని పలు రాజకీయ పార్టీలు ఈ కూటమిలో కలిసి పనిచేశాయి. ఇప్పుడు అధికారంలో బిజెపి సారధ్యపు ఎన్డిఎ చలామణి సాగుతోంది. ఈ క్రమంలో ఇకపై వెలిసే పిడిఎ ఏ విధంగా ఎన్డిఎకు సవాలు విసురుతుందనేది తేలాల్సి ఉంటుంది.
పాట్నాలో శనివారం జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో సిపిఐ పార్టీ ప్రధాన కార్యదర్శి డి రాజా మాట్లాడుతూ త్వరలోనే సిమ్లాలో జరిగే మలిదఫా విపక్ష సదస్సులో పిడిఎకు పూర్తి స్వరూపం ఏర్పడుతుందని తెలిపారు. అయితే దీనిపై ఇప్పటికైతే పూర్తి స్పష్టత రాలేదని, తుది నిర్ణయం తీసుకుంటామని రాజా వివరించారు.రాబోయేది పిడిఎ అని ఆయన వెల్లడించారు.
తమిళనాడులో ఇప్పుడు లౌకిక ప్రజాస్వామిక కూటమి (ఎస్డిఎఫ్) ఉంది. బీహార్లో మహాఘట్బంధన్గా విపక్షాలు కలిశాయి. ఈ క్రమంలో జాతీయ స్థాయిలో వెలిసే పిడిఎలో ఉమ్మడి ప్రతిపక్షాల సంబంధిత విలువలు, కట్టుబాట్లు ఉంటాయని రాజా తెలిపారు.