దేశంలో ఉమ్మడి పౌరస్మృతి అమలు విషయం తిరిగి వేడి అందుకుంది. ఉమ్మడి పౌరస్మృతి (యుసిసి)కి తాము సూత్రప్రాయ మద్దతు ప్రకటిస్తున్నట్లు ఆమ్ ఆద్మీపార్టీ (ఆప్) తెలిపింది. దీని అమలుకు ముందు సంబంధిత భాగస్వామ్య పక్షాలన్నింటి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవల్సి ఉందని ఆప్ స్పష్టం చేసింది.
ఆప్ భారతీయుల కోసం సూత్రప్రాయంగా ఉమ్మడి పౌరస్మృతికి మద్దతు ఇస్తుందని పార్టీ ఎంపీ సందీప్ పాఠక్ వెల్లడించారు. అయితే ఈ దిశలో ఏదైనా చర్య తీసుకోవాలంటే అందరు భాగస్వాములతో విస్తృత స్థాయి చర్చలు జరపాలని ఆయన సూచించారు. తాము సూత్రప్రాయంగా యూనిఫాం సివిల్ కోడ్‌కు మద్దతు ఇస్తున్నామని, రాజ్యాంగంలోని ఆర్టికల్ 44 కూడా దీనికి మద్దతు ఇస్తుందని పాఠక్ తెలిపారు.
అయితే ఈ సమస్య అన్ని మత వర్గాలకు సంబంధించినది కాబట్టి, పరిష్కారం కూడా విస్తృతంగా ఉండాలని పాఠక్ సూచించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 44 ప్రకారం భారతదేశ భూభాగం అంతటా పౌరులకు ఒకే విధమైన పౌర నియమావళిని అమలు చేసేందుకు ప్రయత్నాలు జరగాలని చెప్పారు.
యుసిసిపై ఇప్పటికే కాంగ్రెస్ బిజెపి మధ్య తీవ్ర స్థాయి వ్యాగ్యుద్ధం సాగుతోంది. ఇండియన్ ముస్లిం లీగ్ (ఐయుఎంఎల్), ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు (ఎఐఎంపిఎల్‌బి) ఈ కోడ్ పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి.
భోపాల్‌లో రెండు రోజుల క్రితం ప్రధాని నరేంద్ర మోదీ ఓ సభలో మాట్లాడుతూ దేశంలో ఉమ్మడి పౌర స్మృతి తీసుకురావల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. దీనిపై తీవ్ర స్థాయిలో నిరసనలు వ్యక్తం అయ్యాయి. ప్రతిపక్ష ఐక్యత దిశలో యత్నాల దశలో కీలక ప్రతిపక్షం అయిన ఆప్ మరో విపక్షం కాంగ్రెస్‌ను కాదంటూ కేంద్రానికి పరోక్ష మద్దతు ప్రకటించింది.
ఢిల్లీతో పాటు పంజాబ్‌లో కూడా అధికారంలో ఉన్న ఆప్ కోడ్‌కు మద్దతు ప్రకటించడం కీలకం అయింది. మైనార్టీలకు ఇది చాలా ముప్పుగా మారుతుందని పంజాబ్‌లోని శిరోమణి అకాలీదళ్ నిరసన వ్యక్తం చేసింది. దీనిపై ఉద్యమిస్తామని తెలిపింది. గిరిజనుల హక్కులను కూడా హరించినట్లు అవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.