రెండు డోసుల కరోనా టీకాలు తీసుకున్న వారిని మాత్రమే నూతన సంవత్సరం వేడుకలలోకి అనుమిర్థించాలని హైదరాబాద్ నగర పోలీస్ కమీషనర్ సివి ఆనంద్ స్పష్టం చేశారు. కరోనా, ఒమిక్రాన్ నేపథ్యంలో జంట నగరాల్లో నూతన సంవత్సర వేడుకలపై ఆంక్షలు విధించడంతో పాటు మార్గదర్శకాలను ఆయన విడుదల చేశారు.
నగరంలోని పబ్‌లు, రెస్టారెంట్లతో పాటు నగర వాసులు భౌతిక దూరాన్ని తప్పనిసరిగా పాటించాలని లేకపోతే కఠిన చర్యలు తప్పవని సిపి హెచ్చరించారు. ఈసారి నగర నూతన సంవత్సర పార్టీల్లో డిజెలకు అనుమతి ఉండదని, పబ్‌లు, రెస్టారెంట్లు భౌతిక దూరం తప్పనిసరిగా పాటించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.
పబ్‌లు, బార్ అండ్ రెస్టారెంట్ల సమీపంలో నివాసముంటున్న స్థానికులను ఇబ్బందులకు గురి చేసినట్లు ఫిర్యాదులు వస్తే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అలాగే కరోనా నిబంధనలను అతిక్రమించినా చర్యలు తప్పవని చెప్పారు. ఇందులో భాగంగా కరోనా పరీక్షలు నిర్వహించాకే వాళ్లను ఈవెంట్లలోకి అనుమతించాలని ఈవెంట్ నిర్వాహకులకు సూచించారు.
ఇక రెండు రోజుల ముందే ఈవెంట్లకు అనుమతి తీసుకోవాలని, పరిమితికి మించి పాసులను విక్రయించరాదని సిపి హెచ్చరించారు. పబ్, బార్, ఈవెంట్లలో వాహనాలు పార్కింగ్, శానిటైజింగ్ వసతులు ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
మద్యం మత్తులో ఉన్న కస్టమర్లు సురక్షితంగా గమ్యస్థానాలకు చేరేందుకు డ్రైవర్లు, క్యాబ్‌ల సౌకర్యాలను పబ్‌లు, బార్, ఈవెంట్ల నిర్వహకులే బాధ్యత వహించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. సంవత్సరం వేడుకల సందర్భంగా నిర్వహించే పార్టీల్లో డ్రగ్స్ పట్టుబడితే కఠిన చర్యలు తప్పవని ఆనంద్ హెచ్చరించారు.
అదేవిధంగా ఈవెంట్లలో జనాలలోకి సింగర్స్ వెళ్లొద్దని, అశ్లీల నృత్యాలకు అనుమతి లేదని తేల్చిచెప్పారు. అలాగే జంట నగరాలలో నూతన సంవత్సర వేడుకలలో పాల్గొనే మహిళల భద్రతకు షీ టీం పహారా కొనసాగుతుందని. డిసెంబర్ 31న రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 వరకు ఫ్లైఓవర్లు మూసివేస్తామని సిపి వివరించారు.
తాగి రోడ్లపై హంగామ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, అర్ధరాత్రి ఆకస్మికంగా డ్రంక్ అండ్ డ్రైవ్‌లు నిర్వహిస్తామని, పట్టుబడితే శిక్ష కఠినంగానే వ్యహరిస్తామని తెలిపారు. నూతన సంవత్సర వేడుకలలో ఎవరైనా మాస్క్‌లు లేకుండా కనిపిస్తే జరిమానాలు విధిస్తామని హెచ్చరించారు.
బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించడం, నడిరోడ్లపై బైక్‌లను వేగంగా నడపడం లాంటివి చేస్తే మోటార్ వెహికల్ చట్టం 185 కింద చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
నూతన సంవత్సర వేడుకలకు మార్గదర్శకాలు
* వేడుకల్లో మాస్క్ లేకపోతే రూ.వెయ్యి జరిమానా
* రెండు డోసుల టీకా తీసుకున్న వారికే వేడుకలకు అనుమతి
* వేడుకల్లో భౌతికదూరం పాటించేలా చర్యలు తీసుకోవాలి
* వేడుకలకు రెండు రోజుల ముందు అనుమతి తప్పనిసరి
* సిబ్బందికి 48గంటల ముందు కొవిడ్ పరీక్షలు చేయాలి
* బహిరంగ వేడుకల్లో డీజేకు అనుమతి లేదు
* ధ్వని కాలుష్యంపై ఫిర్యాదు వస్తే చర్యలు
* మద్యం సేవించి వాహనం నడిపితే 6 నెలల జైలు, రూ.10వేల జరిమానా
* అసభ్యకర దుస్తులు ధరించినా, నృత్యాలు చేసినా చర్యలు
* వేడుకల్లో మాదక ద్రవ్యాలకు అనుమతిస్తే చర్యలు.
* జంట నగరాల్లో విస్తృతంగా డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తాం
* మహిళలపై వేధింపులను అరికట్టడానికి షీ బృందాల పహారా
* 3 వేల మంది పోలీసులతో నిరంతర నిఘా