దేశవ్యాప్తంగా కరోనా మళ్లీ కలకలం సృష్టిస్తోంది. ఢిల్లీతో పాటు పలు రాష్ట్రాల్లో కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. ఢిల్లీలో బుధవారం ఏకంగా 923 కేసులు నమోదయ్యాయి. మంగళవారంతో పోలిస్తే పాజిటివ్ కేసుల సంఖ్య 86 శాతం పెరిగాయి.
మే 30 తర్వాత దేశ రాజధానిలో ఇంత భారీ స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదుకావడం ఇదే తొలిసారి. కరోనా కేసులు పెరుగుతుండటంతో అప్రమత్తమైన ఢిల్లీ సర్కారు ఇప్పటికే ఎల్లో అలర్ట్ జారీ చేసింది. స్కూళ్లు, కాలేజీలు మూసివేయడంతో పాటు ఆంక్షలు మరింత కఠినం చేసింది.
కర్నాటకలోనూ భారీగా కేసులు నమోదయ్యాయి. ఆ రాష్ట్రంలో కొత్తగా 566 మందికి కరోనా పాజిటివ్ నిర్థారణ అయింది. 245 మంది కోలుకోగా.. ఆరుగురు మృతి చెందారు. బెంగాల్ లో బుధవారం 1089 కోవిడ్ కేసులు రికార్డయ్యాయి. 807 మంది కరోనా నుంచి కోలుకోగా.. 24 గంటల వ్యవధిలో 12 మంది చనిపోయారు.
కొద్దీ రోజుల్లో క్లిష్టదశలో భారత్
ఈ తరుణంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులు చూస్తుంటే ఎక్కువ జనాభా ఉన్న భారత్‌లో ఒమిక్రాన్ విజృంభణ ఒక్కసారిగా పెరిగిపోవచ్చని కేంబ్రిడ్జి యూనివర్సిటీ పరిశోధకుల బృందం భారత్‌కు హెచ్చరిక జారీ చేసింది.
‘‘రాబోయే కొద్దిరోజుల్లో భారత్ కీలక దశలోకి ప్రవేశించనుంది. కొన్ని వారాల్లో కొత్త ఇన్ఫెక్షన్ కేసులు తారాస్థాయికి చేరుకుంటాయి. కారణం.. ఒమిక్రాన్ వేరియెంట్ వేగం ఎక్కువగా ఉండడం” అంటూ ప్రొఫెసర్ పాల్ కట్టూమన్ స్పష్టం చేశారు.
బహుశా అది ఈ వారం పదిరోజుల నుంచే జరగొచ్చు కూడా. అయితే అమెరికా స్థాయిలో ఉంటుందా? లేదా? అనేది రెండు వారాల్లో తెలిసిపోతుందని ఆయన చెప్పారు బూస్టర్ డోసులతో కట్టడికి ప్రయత్నించినా, ఇన్ఫెక్షన్లను అడ్డుకోవడం కష్టమే అని తెలిపారు. జాగ్రత్తలు పాటించడం ద్వారా పరిస్థితి చేజారకుండా కాపాడుకోవచ్చని సూచించారు.
భారత్‌లో కరోనా ట్రాకర్‌ను రూపొందించిన పరిశోధకుల్లో కట్టూమన్ కూడా ఉన్నారు. డిసెంబర్ 24 దాకా ఆరు రాష్ట్రాల్లో తీవ్రతను గుర్తించిన కరోనా ట్రాకర్.. 26వ తేదీ నాటికి ఆ సంఖ్యను 11 రాష్ట్రాలకు చేర్చడం పరిస్థితికి అద్దం పడుతోంది.
బెంగాల్ లో విద్యాసంస్థలకు సెలవులు
పశ్చిమ బెంగాల్లో కరోనా కేసులు పెరుగుతున్నందున…స్కూళ్లు, పాఠశాలలను మూసివేస్తున్నట్లు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బుధవారం ప్రకటించారు. రాష్ట్రంలో ప్రస్తుత మహమ్మారి పరిస్థితిపై సమీక్ష చేపట్టాలని అడ్మినిస్ట్రేటివ్ సమావేశంలో అధికారులను ఆదేశించారు.
ఇన్ఫెక్షన్ ఎక్కువగా ఉన్నందు వల్ల కోల్‌కతాలో కంటోన్మెంట్ జోన్లను గుర్తించాలని పేర్కొన్నారు. 20 నెలల విరామం తర్వాత నవంబర్‌లో విద్యాసంస్థలు తిరిగి తెరుచుకున్నాయి. ఇప్పుడు కేసులు పెరుగుతుండటంతో మరోసారి మూతపడుతున్నాయి.