గత తొమ్మిదేళ్ల కాలంలో తమ ప్రభుత్వం ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టిందని చెబుతూ వచ్చే తొమ్మిది నెలల్లో వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని మంత్రులకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సూచించారు. త్వరలో కేంద్ర మంత్రి మండలి పునర్ వ్యవస్థీకరణ ఉంటుందనే వార్తల నేపథ్యంలో ప్రధాని మోదీ నేతృత్వంలో సోమవారం జరిగిన మంత్రివర్గ సమావేశం ఐదు గంటలపాటు కొనసాగడం గమనార్హం.
కొత్తగా నిర్మించిన ప్రగతి మైదాన్‌లో జరిగిన ఈ భేటీపై నరేంద్ర మోదీ తాజాగా ట్వీట్ చేవారు. మంత్రిమండలి సమావేశం చాలా ఫలప్రదంగా జరిగిందని ఆయన వెల్లడించారు. విధానపరమైన అంశాలపై చర్చలు జరిగిన్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో భారత్ 2047 వరకు అభివృద్ధి చెందే అవకాశాలపై మంత్రులకు ప్రజెంటేషన్ ఇచ్చారు.
2024 ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని జరిగిన ఈ కీలకమైన భేటీలో వచ్చే ఎన్నికలను అభివృద్ధి అజెండాపై ఎదుర్కోబోతున్నట్లు ప్రధాని స్పష్టం చేసిన్నట్లు తెలిసింది. తమ అభివృద్ధి అజెండాపై నడుస్తున్నదని చెబుతూ అభివృద్ధి ఫలాలు ప్రతివారికి చేరేటట్లు చూడటం మంత్రుల సమిష్టి బాధ్యత అని తేల్చి చెప్పారు.
ప్రభుత్వ పధకాలు ప్రజలకు చేరడం పట్ల ఎక్కువగా దృష్టి సారించాలని, ప్రజలతో నిత్యం సంబంధాలు ఏర్పర్చుకొంటూ ఉండాలని ప్రధాని సూచించారు. తమ మంత్రిత్వ శాఖలు, ప్రభుత్వం జరుపుతున్న కృషిని ప్రజలు వివరించాలని చెప్పారు.
తొమ్మిదేళ్ల మోడీ పాలన, వచ్చే ఏడాది జరగబోయే సార్వత్రిక ఎన్నికలపై మంత్రిమండలిలో కీలకంగా చర్చించినట్లు సమాచారం. అంతేగాక, ఈ ఏడాది జరగనున్న పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, ప్రభుత్వ ప్రాధాన్యత అంశాలతోపాటు పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో తీసుకురావాల్సిన కీలక బిల్లులపై చర్చించినట్లు తెలిసింది.
2019లో రెండోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టాక నరేంద్ర మోదీ ఇప్పటి వరకు ఒక్కసారి మాత్రమే కేంద్ర మంత్రి మండలిని విస్తరించిన విషయం తెలిసిందే. కాగా, కరోనావైరస్ మహమ్మారి పరిణామాల తర్వాత కేంద్ర మంత్రిమండలి భేటీ జరగడం ఇది రెండోసారి కావడం గమనార్హం.
