దేశవ్యాప్తంగా బీజేపీ ప్రాతినిధ్యం లేని ప్రాంతం, సామాజిక వర్గం లేదు.. ప్రజలంతా ప్రధాని మోదీ పాలన పట్ల మొగ్గు చూపుతున్నారని బిజెపి ఎంపి, ఓబిసి మోర్చా అధ్యక్షుడు డాక్టర్ కె. లక్ష్మణ్ స్పష్టం చేశారు. దక్షిణాదిలో బిజెపిని విస్తరించే దిశగా కార్యాచరణ ప్రణాళిక తయారు చేశామని చెప్పారు.
తెలంగాణలో పార్టీని విస్తరించేందుకు జాతీయ నాయకత్వం ప్రాధాన్యమిస్తుందని చెబుతూ అందులో భాగంగానే రాష్ట్ర పార్టీ ఎన్నికల బాధ్యులుగా ప్రకాష్ జవదేకర్, సునీల్ బన్సల్ లను నియమించారని వెల్లడించారు. స్థానిక అంశాల ప్రభావితంతోనే కర్ణాటకలో కాంగ్రెస్ గెలిచిందని ఆయన పేర్కొన్నారు.
పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం మోదీకి ఓటు వేసేందుకు కర్ణాటక ప్రజలు సిద్దంగా ఉన్నారని డా. లక్ష్మణ్ భరోసా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో బిఆర్ఎస్ పట్ల విసుగు చెందిన ప్రజలు బిజెపికి పట్టం కట్టేందుకు సిద్దంగా ఉన్నారని తెలిపారు. వరంగల్ సభకు హాజరైన ప్రజలను చూస్తే ఇది అర్థం అవుతోందని చెప్పారు.
ప్రధాని హోదాలో మోదీ బిఅర్ఎస్ పై విరుచుకు పడ్డారని గుర్తుచేశారు. అవినీతి వల్లే బిఆర్ఎస్ నేతలు ప్రధానికి ముఖం చాటేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి పట్ల ప్రధాని మోదీ అవేదనతో ఉన్నారని చెప్పారు.
అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేంద్ర అభివృద్ధి పనుల్లో భాగస్వాములు అవుతున్నారని చెబుతూ రాబోయే ఎన్నికల్లో ఈ 30 శాతం కమిషన్ ప్రభుత్వాన్ని ప్రజలు తిప్పికొడతారని లక్ష్మణ్ ధీమా వ్యక్తం చేశారు. దళితబంధు పథకంలో ఎమ్మెల్యేలు అవినీతికి పాల్పడుతున్నారని విమర్శించారు.
ఆ పార్టీ నేతలు ఒకరి అవినీతి ఒకరు బయటపెట్టుకుంటున్నారని ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు బిజెపిని ఆదరిస్తారని లక్ష్మణ్ ధీమా వ్యక్తం చేశారు.