ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్ హింసాత్మక ఘటనలతో అట్టుడుకుతుంటే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏమాత్రం పట్టించుకోకుండా విదేశీ పర్యటనల్లో తలమునకలవుతున్నారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ శనివారం ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యలను బీజేపీ నేత, కేంద్ర మంత్రి స్మ్రితి ఇరానీ అంతే దీటుగా తిప్పికొట్టారు. ఈ వ్యవహారం వారిద్దరి మధ్య ‘ట్వీట్ వార్’కు దారితీసింది.
“మణిపూర్ మండుతోంది. ఈయూ పార్లమెంట్ భారతదేశ అంతర్గత వ్యవహారంపై చర్చించింది. ప్రధాన మంత్రి మాత్రం ఒక్క ముక్క కూడా మాట్లాడలేదు. ఇదే సమయంలో ఆయనకు రఫేల్ వల్ల బాస్టీల్ డే పరేడ్‌కు టిక్కెట్ లభించింది” అంటూ రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు.
మణిపూర్ స్వస్థతను కోరుకుంటోంది. రెండు రోజుల పర్యటనలో అక్కడి ప్రజల ఆవేదన చూసి నా గుండె తరుక్కుపోయింది. శాంతి నెలకొల్పడం ఒక్కటే మార్గం. ఆ దిశగా మనమంతా పనిచేయాలని రాహుల్ పేర్కొన్నారు.
రాహుల్ వ్యాఖ్యలను కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఏమాత్రం ఆలస్యం చేయకుండా తిప్పికొట్టారు. భారత అంతర్గత వ్యవహారాల్లో అంతర్జాతీయ జోక్యం ఉండాలని రాహుల్ కోరుకుంటున్నారని ఆమె విమర్శించారు. “ఈ విసుగు చెందిన వారసుడు మేకిన్ ఇండియా ఆశయాలను తుంగలో తొక్కారు. ప్రధానికి గౌరవం లభిస్తే సహించలేకుండా ఉన్నారు. తమ కాళ్ల దగ్గరకు రక్షణ ఒప్పందాలు రావడం లేదనే నిరాశలో ఉన్నారు” అని స్మృతి ఇరానీ ట్వీట్ చేశారు.
కాగా, ఈ ట్వీట్‌వార్ ఇంతటితో ఆగలేదు. స్మృతి ఇరానీకి కాంగ్రెస్ నేత సుప్రియ ష్రినేట్ గట్టి కౌంటర్ ఇచ్చారు. మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నా, అథ్లెట్లపై లైంగిక వేధింపులు జరుగుతున్నా, ధరలు నడ్డివిరుస్తున్నా ఒక్కముక్క కూడా ఆమె మాట్లాడరని, రాహుల్ గాంధీపై విషం జిమ్మేందుకు మాత్రం ముందుటారని ఎద్దేవా చేశారు. సొంత పార్టీ పక్కన పెట్టేయడంతో నిరాశనిస్పృహల్లో కూరుకుపోయారని, విద్వేషంతో బాధపడుతున్న మీరు వైద్యులను సంప్రదించాలని ష్రినేట్ సలహా ఇచ్చారు.