మావోయిస్టు అగ్రనేత ఆర్కె భార్య శిరీషను జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) అరెస్టు చేసింది. ఈ మేరకు ఎన్ఐఏ ఓ ప్రకటన విడుదల చేసింది. గుంటూరులో ఉంటున్న శిరీష అనారోగ్యంతో బాధపడుతోంది. చికిత్స కోసం విజయవాడకు వెళ్లి వచ్చే సరికి ఎన్ఐఏ అధికారులు ఇంట్లో సోదాలు నిర్వహించారు.
శిరీష వచ్చిన వెంటనే ఆమెను, దుడ్డు ప్రభాకర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరు మావోయిస్టుల కోసం పనిచేస్తున్నారని తెలిపారు. వీరు మావోయిస్టుల నుంచి భారీగా నిధులు తీసుకున్నారని పేర్కొన్నారు. ఈ విషయం ఆరెకె డెయిరీ ఆధారంగా అరెస్టు చేసినట్లు అధికారులు పేర్కొన్నారు.
2019 తిరియా ఎన్కౌంటర్లో ప్రభాకర్, శిరీష ఇద్దరు పాల్గొన్నట్లు ఎన్ఐఏ తెలిపింది. మావోయిస్టుల కోసం రిక్రూట్మెంట్ కూడా వీరు నిర్వహిస్తున్నారని తెలిపారు. మావోయిస్టుల వారోత్సవాల సందర్భంగా భారీ కుట్రకు ప్రణాళిక సిద్ధం చేశారని వివరించారు.
మావోయిస్టు అగ్రనేత ఆర్కే సతీమణి శిరీష అలియాస్ పద్మను ఎన్ఐఎ శుక్రవారం సాయంత్రం ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం ఆలకూరపాడులోని ఆమె నివాసంలో అదుపులోకి తీసుకుంది. మావోయిస్ట్ ఆర్కే 2021 అక్టోబర్ 16న అనారోగ్యంతో మృతి చెందారు. ఆయన కుమారుడు మున్నా కూడా ఉద్యమబాటులో నడిచి, పోలీసులు ఎదురు కాల్పుల్లో మరణించాడు.
గత ఏడాది ఆలకూరపాడులో శిరీష ఇంట్లో ఎన్ఐఏ బృందం తనిఖీలు చేసింది. మావోయిస్టులకు సహకరించడం, నగదు సమకూర్చడం, వైద్య విద్యార్థినితో మావోయిస్టులకు వైద్యం చేయించి, వారిని మావోయిస్టుల వైపు ఆకర్షించేలా చేయడంలో శిరీషకు సంబంధం ఉందని ఎన్ఐఏ అధికారులు ఆరోపించారు.
ఈ ఆరోపణలతో 2022 జులై 19న ఎన్ఐఏ బృందం శిరీష ఇంట్లో తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో లభించిన ఆధారాలతో ఆర్కే భార్య శిరీషను అరెస్టు చేసినట్లు ఎన్ఐఏ ప్రకటించింది.
కాగా, కుల నిర్మూలన పోరాట సమితి నేత దుడ్డు ప్రభాకర్‌ను అరెస్టు చేసినట్లు ఎన్ఐఎ ఏపీ హైకోర్టుకు తెలిపింది. చట్ట విరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం (ఉపా) కింద అరెస్టు చేసినట్లు చెప్పింది. ఛత్తీస్‌గఢ్, జగదల్పూర్ కోర్టులో హాజరుపర్చిన విషయాన్ని కూడా విజయవాడలోని అజిత్‌సింగ్ నగర్ పోలీసులకు తెలియజేశామని స్పష్టం చేసింది.
ఈ విషయాన్ని జస్టిస్ డివిఎస్ఎస్ సోమయాజులు, జస్టిస్ దుప్పల వెంకటరమణతో కూడిన డివిజన్ బెంచ్‌కు ఎన్ఐఎ తరఫున న్యాయవాది శనివారం నివేదించారు. తన భర్త ప్రభాకర్‌ను ఎన్ఐఎ అధికారులు అక్రమంగా అదుపులోకి తీసుకున్నారంటూ ఆయన భార్య దుడ్డు కుసుమ కుమారి దాఖలు చేసిన హెబియస్ కార్పస్ పిటిషన్‌పై విచారణ ఈ నెల 27కు వాయిదా పడింది.