వచ్చే ఏడాది లోక్సభ ఎన్నికలు జరుగనున్న తరుణంలో ఉత్తరప్రదేశ్ లోని సమాజ్వాదీ పార్టీకి గట్టి దెబ్బ తగిలింది. 2019 లోక్సభ ఎన్నికల్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై వారణాసి నుంచి ఎస్పీ అభ్యర్థిగా పోటీ చేసిన షాలిని యాదవ్ సోమవారంనాడు బీజేపీలో చేరారు. ఉత్తరప్రదేశ్లోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు భూపేంద్ర సింగ్ చౌదరి సమక్షంలో షాలిని యాదవ్ బీజేపీ కండువా కప్పుకున్నారు.
షాలినితో పాటు పలువురు నేతలు కూడా బీజేపీలో చేరారు. కష్టపడి పనిచేసే కార్యకర్తలను సమాజ్వాదీ పార్టీ పట్టించుకోవడం లేదని, ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వారి ఓటమికి ఇదొక కారణమని బీజేపీలో చేరిన అనంతరం షాలిని మీడియాతో మాట్లాడుతూ చెప్పారు.
వారణాసి కాంగ్రెస్ మాజీ ఎంపీ దివంగత శ్యామ్లాల్ యాదవ్ కోడలైన షాలిని యాదవ్ 2019లో సమాజ్వాదీ పార్టీలో చేరారు. 2017లో వారణాసి మున్సిపల్ కార్పొరేషన్ నుంచి మేయర్ ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2019 లోక్సభ ఎన్నికల్లో వారణాసి నుంచి మోదీకి ప్రత్యర్థిగా సమాజ్వాదీ పార్టీ తరఫున షాలిని పోటీ చేశారు. 4.75 లక్షల ఓట్ల తేడాతో ఓటమి చవిచూశారు.