వరద సహాయ చర్యల్లో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయాధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు డా. కే. లక్ష్మణ్ ఆరోపించారు. కేసీఆర్ నదులకు నడకలు నేర్పారు అంటూ ఆ పార్టీ నేతలు గొప్పలు పోయారని, కానీ యావత్ రాష్ట్రాన్నే వరద నీటితో సముద్రంగా మార్చిన ఘనత మాత్రం ఆయనకు దక్కుతుందని ఎద్దేవా చేశారు.
తెలంగాణలో వర్షాలు, వరదల గురించి పార్లమెంటులో లేవనెత్తాలని చూస్తుంటే ప్రతిపక్షాలు సభ సజావుగా సాగకుండా అడ్డుకుంటున్నాయని ధ్వజమెత్తారు. ప్రజాధనాన్ని వృధా చేయడమే లక్ష్యంగా విపక్షాలు వ్యవహరిస్తున్నాయని దుయ్యబట్టారు. ఈ పరిస్థితుల్లో తాము తెలంగాణ బీజేపీ నేతల బృందం కేంద్ర హోంమంత్రి అమిత్ షా ను కలిసి వరద పరిస్థితి గురించి వివరించామని చెప్పారు.
ఆయన భేటీ ముగిసి బయటికొచ్చేలోపే కేంద్ర బృందాన్ని ఏర్పాటు చేస్తూ అమిత్ షా ఆదేశాలు జారీ చేశారని తెలిపారు. వరదల నష్టంపై కేంద్ర బృందం నివేదిక ఇచ్చిన వెంటనే తక్షణ సహాయం అందుతుందని తెలిపారు.
మరోవైపు పార్టీలో జరిగిన సంస్థాగత మార్పుల గురించి ప్రస్తావిస్తూ పార్టీ రాష్ట్ర అధ్యక్ష మార్పు జరగగానే శ్రేణుల్లో తప్పుడు సంకేతాలు వెళ్లాయని, కానీ బండి సంజయ్కు పార్టీ అధిష్టానం పదోన్నతి కల్పించి ఏకంగా జాతీయ ప్రధాన కార్యదర్శిగా కీలక బాధ్యతలు అప్పగించిందని తెలిపారు. జాతీయ ప్రధాన కార్యదర్శులుగా ఉన్న 8 మందిలో దక్షిణ భారతదేశం నుంచి ఉన్న ఏకైక వ్యక్తి బండి సంజయ్ అని గుర్తుచేశారు.
పార్టీ బండి సంజయ్ ప్రాధాన్యతను ఏమాత్రం తగ్గించకపోగా మరింత పెంచిందని చెబుతూ పార్టీ శ్రేణులు కూడా ఈ విషయాన్ని గమనించాలని కోరారు. కొందరు నేతలు పార్టీ వీడి వెళ్లడం గురించి ప్రశ్నించగా, పార్టీని ఒక్కరు వీడితే నలుగురు చేరుతున్నారని లక్ష్మణ్ చెప్పారు. రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబ పాలనపై ప్రజలు విసుగు చెంది ఉన్నారని, ఒకే కుటుంబం నుంచి ఆరుగురు కీలక పదవుల్లో ఉన్నారని తెలిపారు.
ఇక సామాజిక న్యాయం ఎక్కడుందని ప్రశ్నించారు. గత ఎన్నికల్లో కేసీఆర్ అహంకార, అవినీతి, కుటుంబ పాలనను వ్యతిరేకిస్తూ ప్రజలు కాంగ్రెస్కు ఓటేస్తే.. గెలిచిన వెంటనే ఆ పార్టీ నేతలు ప్రభుత్వంలో చేరిపోయారని గుర్తు చేశారు. మొత్తంగా ప్రజల నమ్మకాన్ని కాంగ్రెస్ పార్టీ పూర్తిగా కోల్పోయిందని స్పష్టం చేశారు.