ప్రముఖ నటి, మాజీ ఎమ్యెల్యే జయసుధ బుధవారం సాయంత్రం న్యూఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో కాషాయ తీర్థం పుచ్చుకున్నారు. తెలంగాణ వ్యవహారాల ఇంఛార్జి తరుణ్‌చుగ్, రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ సమక్షంలో బీజేపీలో చేరారు. తరుణ్ చుగ్ ఆమెకు పార్టీ సభ్యత్వం అందించి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
సినిమా రంగంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న జయసుధ, శాసన సభ్యురాలిగా కూడా ప్రజలకు సేవలందించి మన్ననలు పొందారని కిషన్‌రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. ఆమె ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అదే సభలో తాను ఎమ్మెల్యేగా ఉన్నానని గుర్తు చేశారు. పేదల పక్షాన, బస్తీవాసుల అభివృద్ధి కోసం పని చేసిన జయసుధ చేరికతో బీజేపీకి లాభం చేకూరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
మోదీ నాయకత్వంలో దేశం చాలా అభివృద్ధి చెందిందని చెబుతూ తాను బీజేపీలో చేరటం చాలామందికి ఆశ్చర్యం కలిగించినా ఎప్పట్నుంచో అనుకుంటున్నానని జయసుధ తెలిపారు. హోంమంత్రి అమిత్ షాను కలిశానని ఆమె వెల్లడించారు. పని చేయాలనే ఉద్దేశంతోనే తాను బీజేపీలో చేరానని తెలిపారు.
తాను ఒక వర్గానికి (క్రైస్తవ) ప్రాతినిథ్యం వహిస్తున్నానని చెబుతూ, అయితే తాను అందరి మనిషినన్న జయసుధ, ఒక మతం, కులంపరంగా కాకుండా నటిగా జాతీయ పార్టీ ద్వారా మంచి పనులు చేయాలని బీజేపీలోకి వచ్చానని జయసుధ వివరించారు. తన పార్టీ మార్పు మంచి మార్పు, మంచి రోజుల కోసమని నమ్ముతున్నానని ఆమె పేర్కొన్నారు.