అమృత్ భారత్ పథకం కింద దేశం లోని 508 రైల్వే స్టేషన్ల పునరభివృద్ధి పనులకు రూ.24,470 కోట్లతో ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్‌గా ఆదివారం శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ ““అభివృద్ధి దిశగా దేశం పరుగులు పెడుతోంది. దేశ రైల్వే చరిత్రలో సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టాం. 508 రైల్వేస్టేషన్ల అభివృద్ధికి రూ.25వేల కోట్లు కేటాయించాం. రైల్వే స్టేషన్ల వద్ద షాపింగ్ కాంప్లెక్స్, గేమింగ్ జోన్ లు ఏర్పాటు చేస్తాం. అభివృద్ధి చేసిన తర్వాత ఈ స్టేషన్లు మల్టీ మోడల్ హబ్ గా మారతాయి” అని పేర్కొన్నారు.
దేశవ్యాప్తంగా ఆయా ప్రాంతాల్లో స్థానిక ప్రజా ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అమృత్‌భారత్ పథకం కింద తొలిదశలో తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 39 రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేయనున్నారు. తెలంగాణలో రూ. 894.09 కోట్లతో 21 స్టేషన్లు, ఏపీలో 453.50 కోట్లతో 18 స్టేషన్లలో అభివృద్ధి పనులు చేపట్టనున్నారు.
నాంపల్లి రైల్వే స్టేషన్లో నిర్వహించిన కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, తెలంగాణ గవర్నర్ తమిళిసై, కరీంనగర్ రైల్వేస్టేషన్లో ఎంపీ బండి సంజయ్ పాల్గొన్నారు. ఏపీ లోని ఏలూరు రైల్వేస్టేషన్లో నిర్వహించిన కార్యక్రమానికి గవర్నర్ అబ్దుల్ నజీర్ హాజరయ్యారు.
తొలిదశలో అభివృద్ధి చేసే స్టేషన్లు
తెలంగాణలో… ఆదిలాబాద్, భద్రాచలం రోడ్, హఫీజ్‌పేట, హైటెక్‌సిటీ, ఉప్పుగూడ, హైదరాబాద్, జనగామ, కామారెడ్డి, కరీం నగర్, కాజీపేట, ఖమ్మం, మధిర, మహబూబ్‌నగర్,మహబూబాబాద్, మలక్‌పేట, మల్కాజిగిరి, నిజామాబాద్, రామగుండం, తాండూరు, యాదాద్రి (రాయగిరి), జహీరాబాద్.
ఆంధ్రప్రదేశ్‌లో పలాస, విజయనగరం, అనకాపల్లి, దువ్వాడ, భీమవరం, నరసాపురం, తాడేపల్లిగూడెం, నిడదవోలు, తెనాలి, రేపల్లె, పిడుగురాళ్ల, కర్నూలు, కాకినాడ టౌన్, ఏలూరు, తుని, ఒంగోలు, సింగరాయకొండ, దొనకొండ