చంద్రయాన్-3 తొలిసారిగా తీసిన చంద్రుడి వీడియోను ఇస్రో ఆదివారం విడుదల చేసింది. శనివారం జాబిల్లి కక్ష్యలోకి ప్రవేశించే సమయంలో స్పేస్‌క్రాఫ్ట్ ఈ దృశ్యాలను చిత్రీకరించింది. గుంతలు గుంతలుగా ఉన్న చందమామ ఉపరితలం అందులో కనిపించింది.
మరోవంక, చంద్రయాన్-3 ఒక్కొక్క అడుగువేస్తూ జాబిల్లి దిశగా ముందుకు వెళ్తున్నది. ఇప్పటికే చంద్రయాన్-3వ్యోమనౌక చందమామ కక్ష్యలోకి ప్రవేశించింది. దీంతో శాటిలైట్ కక్ష్య తగ్గింపుపై ఇస్రో దృష్టిసారించింది. ఆదివారం రాత్రి పొద్దుపోయిన తర్వాత విజయవంతంగా వ్యోమనౌక కక్ష్యను తగ్గించింది.
ఇలా కక్ష్యను తగ్గిస్తూ ఈ నెల 17 తర్వాత వ్యోమనౌకను చంద్రుడికి చేరువ చేస్తారు. అనంతరం వ్యోమనౌకను చంద్రుడికి 100 కి.మీల ఎత్తులోకి తీసుకళ్తారు. తదనంతరం ఈ నెల 23న చంద్రుడిపై ల్యాండర్ ను ల్యాండ్ చేస్తారు. చంద్రయాన్-3ని చంద్రుడికి మరింత దగ్గర చేసే దిశగా ఈ నెల 9న మరో చిన్న కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నారు.
ఆగస్టు 9న మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల మధ్య ఈ ప్రక్రియను చేపట్టనున్నారు. ఇలా దశలవారీగా కక్ష్యను తగ్గిస్తూ వ్యోమనౌకను చంద్రుడికి మరింత దగ్గర చేయనుంది. ప్రస్తుతం చంద్రయాన్-3.. చందమామ ఉపరితలానికి 170 కిలోమీటర్ల దూరంలో ఉన్నదని ఇస్రో తెలిపింది.
చంద్రయాన్-3ని జూలై 14న ఎల్వీఎం3-ఎం4 రాకెట్ ద్వారా ఇస్రో ప్రయోగించిన విషయం తెలిసిందే. 18 రోజులపాటు భూకక్ష్యలో తిరిగిన వ్యోమనౌక ఈ నెల 1న ట్రాన్స్ లూనార్ కక్ష్యలోకి అడుగుపెట్టింది. శనివారం చంద్రుని కక్ష్యలోకి చేరింది. క్రమంగా కక్ష్యలను తగ్గిస్తూ చంద్రయాన్-3ని చంద్రమామకు 100 కిలోమీటర్ల ఎత్తులోకి ఇస్రో చేర్చనున్నది. ఇదంతా అనుకున్నట్లే జరిగినట్లయితే ఈ నెల 23న చంద్రుడిపై ల్యాండర్ అడుగుపెట్టే అవకాశం ఉంది.