తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) చైర్మన్ పదవి రాజకీయ పునరావాసం కాకూడదని బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి స్పష్టం చేశారు. ఈ మేరకు ఆమె సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్ (ఎక్స్)లో ట్వీట్ చేశారు. హిందూ ధర్మంపై నమ్మకం ఉన్నవాళ్లే ఈ పదవికి న్యాయం చేయగలరని ఆమె స్పష్టం చేశారు.
ఇంతకుముందు ఈ ప్రభుత్వం 80 మంది సభ్యులతో ధర్మకర్తల మండలిని నియమించిందని, ఈ విషయంపై గళం విప్పిన తర్వాత 52 మంది నియామకం నిలిపి వేశారని ఆమె గుర్తు చేశారు. అంటే ప్రభుత్వం ఈ నియామకాలను రాజకీయ పునరావాస నియామకాలుగానే పరిగణిస్తోందని అర్థమవుతోందని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాబట్టి టీటీడీ చైర్మన్ పదవికి హిందూ ధర్మంపై నమ్మకం ఉన్న వారిని, హిందూధర్మం అనుసరించే వాళ్ళని నియమించాలని ఆమె స్పష్టం చేశారు. కాగా, టీటీడీ చైర్మన్గా వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డిని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఆయన గతంలోనూ టీటీడీ చైర్మన్గా పని చేశారు.
10న కలెక్టరేట్ల వద్ద ఆందోళనకు పిలుపు
కాగా, ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈనెల 10న కలెక్టరేట్ల వద్ద ఆందోళనకు ఏపీ బీజేపీ పిలుపునిచ్చింది. రాష్ట్ర స్ధాయిలో నాలుగు జోనల్ సమావేశాల్లో రాష్ట్ర ప్రభుత్వ వైఖరిపై పోరుబాట పట్టాలని ఆమె సూచించారు. ఈ సందర్భంగా దగ్గుబాటి మాట్లాడుతూ గ్రామ పంచాయతీల నిధులను స్వాహా చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీయాలని పార్టీ శ్రేణులను కోరారు.
సర్పంచ్లు చేస్తున్న ఆందోళనకు గతంలోనే బీజేపీ మద్దతు పలికిందని ఆమె గుర్తుచేశారు. పంచాయితీల నిధులను స్వాహాచేస్తే గ్రామాలు ఎలా అభివృద్ది చెందుతాయని ఆమె ప్రశ్నించారు. కేంద్రం నేరుగా గ్రామ పంచాయతీలకు నిధులు విడుదల చేస్తే రాష్ట్ర ప్రభుత్వం ఆ నిధులకు మోకాలొడ్డుతోందని ఆమె మండిపడ్డారు.
రాష్ట్ర ప్రభుత్వ వైఖరి వల్ల గ్రామ పంచాయితీల్లో కనీస మౌలిక సదుపాయాలు కూడా కల్పించలేని పరిస్ధితులు ఏర్పడుతున్నాయని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. సర్పంచ్ల హక్కుల సాధనకై పోరుబాట పడుతున్నామని ఆమె తెలిపారు. రాష్ట్ర నేతలు, కోర్ కమిటీ సభ్యలతో ఆడియో, వీడియో కాన్ఫెరెన్సులు నిర్వహించామని దగ్గుబాటి పురంధేశ్వరి పేర్కొన్నారు.
కాగా, ఒక్కొక్క జిల్లా కేంద్రంలో ఒకొక్క రాష్ట్ర స్థాయి నేత ఈ ఆందోళనలకు నేతృత్వం వహించే విధంగా ఆమె కార్యక్రమం రూపొందించారు. ఆమె స్వయంగా ఈనెల 10న ఒంగోలు కలెక్టరేట్ వద్ద జరిగే ఆందోళనకు నేతృత్వం వహిస్తారు. మరో మాజీ కేంద్ర మంత్రి సుజనా చౌదరి విజయవాడలో జరిగే కార్యక్రమానికి సారధ్యం వహిస్తారు.
అరకులో మాజీ ఎంపి కొత్తపల్లి గీత, విజయనగరంలో మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, విశాఖపట్నంలో బీజేపీ జాతీయ కార్యదర్శి వై సత్యకుమార్ పాల్గొంటారు. అనకాపల్లిలో బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేటుకూరి సూర్యనారాయణరాజు, కాకినాడలో బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యులు సోము వీర్రాజు, రాజమహేంద్రవరంలో మాజీ ఎమ్మెల్సీ పివిఎన్ మాధవ్, మచిలీపట్నంలో బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి చందుసాంబశివరావు, గుంటూరులో మాజీ ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి పాలగొంటారు.
నెల్లూరులో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బిట్ర శివన్నారాయణ, తిరుపతిలొ బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి, కడపలో మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి, హిందుపూర్ లో ఏపీ సహ ఇంఛార్జి సునీల్ దేవదర్, కర్నూల్ లో మాజీ ఎంపీ టిజి వెంకటేష్, నంద్యాల లో మాజీ ఎమ్మెల్యే ఎం ఎస్ పార్ధసారధి హాజరు కానున్నారు.