పార్లమెంటులో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడానికి కొద్దిసేపటి ముందు జరిగిన బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. అవిశ్వాస తీర్మానంపై జరిగే చర్చ విషయంలో ఎలాంటి ఆందోళన చెందాల్సిన పనిలేదని తెలిపారు. ఈ విషయంలో చివరి బంతికి సిక్స్ కొడతామని ధీమా వ్యక్తం చేశారు.
‘‘ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమి ప్రవేశపెట్టిన తీర్మానం.. వారికి ఓ కార్యక్రమం మాత్రమే. కానీ ఇది మనకు మంచి అవకాశం. అవినీతి, కుటుంబ రాజకీయాలకు అతీతంగా భారతదేశాన్నిఉంచాలన్న ఎన్డీఏ నినాదం అలానే ఉంది”అని ప్రధాని పేర్కొన్నారు. అది అహంకారుల కూటమి అని, అహంకారులను ఐక్యంగా ఎదుర్కోవాలని ఆయన పిలుపునిచ్చారు.
ఢిల్లీ బిల్లుకు రాజ్యసభలో ఆమోదం లభించడంపై హర్షం వ్యక్తం చేస్తూ.. అది 2024 ఎన్నికలకు సెమీ ఫైనల్స్ వంటిదని వ్యాఖ్యానించారు. 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు జరిగిన సెమీ ఫైనల్స్‌లో ఇండియా కూటమి పరాజయం పాలైందని మోదీ ఎద్దేవా చేశారు. 2023 లో విపక్షం తనపై అవిశ్వాసం తీసుకువస్తుందని తాను 2018లొనే చెప్పిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
ఇక ఈ రోజు అవిశ్వాస తీర్మానంపై చర్చను కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ ప్రారంభించారు. సభలో సంఖ్యాబలం తమకు లేకున్నా.. అవిశ్వాస తీర్మానం తీసుకురావాల్సిన పరిస్థితిని తమకు కల్పించారని విమర్శించారు. ఇది సంఖ్యా బలానికి సంబంధించినది కాదని, కేవలం మణిపూర్ రాష్ట్రానికి న్యాయం జరగడం కోసమేనని స్పష్టం చేశారు.
ప్రభుత్వంపై అవిశ్వాసం ప్రకటించాలని కోరుతూ తాను ఈ తీర్మానాన్ని ప్రతిపాదించానని తెలిపారు. ఇండియా కూటమి ఈ తీర్మానాన్ని మణిపూర్ రాష్ట్రం కోసం తీసుకొచ్చిందని, మణిపూర్ న్యాయం కోరుతోందని తెలిపారు. మణిపూర్ తగులబడుతోందంటే భారత దేశం తగులబడినట్లేనన్నారు. వివిధ వర్గాల మధ్య ఇంత తీవ్రమైన విద్వేషాన్ని మునుపెన్నడూ చూడలేదన్నారు.
మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్ బిరేన్ సింగ్‌ను ఆ పదవి నుంచి ఎందుకు తొలగించడం లేదని ప్రశ్నించారు. బీజేపీ రాజకీయాలు మణిపూర్‌లో రెండు మణిపూర్‌లను సృష్టించాయని దుయ్యబట్టారు. రాష్ట్రంలో మాదక ద్రవ్యాల జాఢ్యం పెరిగిందని ఆరోపించారు. గంజాయి సాగు పెరుగుతోందన్నారు.
ఈ తీర్మానానికి వ్యతిరేకంగా మాట్లాడిన బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబే ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారు. లోక్ సభ ఎన్నికల కోసం ఏర్పాటైన ప్రతిపక్ష కూటమి ఇండియాలో ఏ అక్షరం దేనిని సూచిస్తుందో కూడా ఆ కూటమిలోని ఎంపీలకు తెలియదన్నారు. ఇండియా అంటే ఏమిటో చెప్పాలని సభలోని ఎంపీలను అడగండని కోరారు.
అవిశ్వాస తీర్మానంపై చర్చకు మొత్తం 16 గంటల సమయాన్ని స్పీకర్ ఓం బిర్లా కేటాయించారు. బిజెపి, కాంగ్రెస్ సహా పలు పార్టీలకు చెందిన 15 మంది ప్రసంగించనున్నారు.