కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మరో వివాదంలో ఇరుక్కున్నారు. లోక్సభలో ఆయన ఫ్లయింగ్ కిస్ ఇచ్చారు. అయితే ఆ కిస్ ఎవరికి ఇచ్చారన్నది స్పష్టంగా తెలియదు. కానీ అవిశ్వాస తీర్మానంపై ప్రసంగం ముగించే సమయంలో ఆయన ఫ్లయింగ్ కిస్ ఇచ్చారు. ఇక రాహుల్ తర్వాత అవిశ్వాస తీర్మానంపై కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ మాట్లాడారు.
రాహుల్ గాంధీ ప్రవర్తన సరిగా లేదని ఆమె ఆరోపించారు. బీజేపీ మహిళా ఎంపీలపై రాహుల్ ఫ్లయింగ్ కిస్ ఇచ్చినట్లు ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. బహుశా మంత్రి స్మృతి ఇరానీని టార్గెట్ చేస్తూ రాహుల్ ఆ కిస్సింగ్ సంకేతాలు ఇచ్చి ఉంటాడేమో అని భావిస్తున్నారు. రాహుల్పై తీవ్ర చర్యలు చేపట్టాలని బీజేపీ మహిళా ఎంపీలు డిమాండ్ చేస్తున్నారు.
మోదీ పేరుతో ఉన్న వారంతా దొంగలే అని వ్యాఖ్యలు చేసిన కేసు వల్ల ఎంపీ సభ్యత్వాన్ని కోల్పోయిన రాహుల్.. సుప్రీం ఆదేశాల తర్వాత సోమవారమే సభలో అడుగుపెట్టారు. అయితే రెండో రోజే మళ్లీ అతని ప్రవర్తనపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. స్త్రీ ద్వేషి మాత్రమే ఇలాంటి సంకేతాలు ఇస్తారని మంత్రి స్మృతి ఆరోపించారు.
‘‘నేను నిశ్చేష్టురాలినయ్యాను. ఆయన తప్పుగా ప్రవర్తించాడు. స్త్రీలను ద్వేషించే వ్యక్తే మహిళా పార్లమెంటేరియన్లకు ఫ్లయింగ్ కిస్ ఇవ్వగలడు. ఓ కుటుంబం నుంచి వచ్చిన ప్రతినిధిగా (గాంధీ కుటుంబం).. తాను తన పార్టీ మహిళల గురించి ఎలా భావిస్తుందో చూపించాడు. ఆయనకు చైనాతో సంబంధాలు కలిగి ఉండడం తప్పించి, భారత్ కు చేసిందేమీ లేదు’’ అని ఇరానీ రాహుల్ తీరును ఎండగట్టారు.
రాహుల్ చేసిన చర్యపై బీజేపీ మహిళా ఎంపీలు స్పీకర్ కు ఫిర్యాదు చేశారు.. అయితే దీనిపై రాహుల్ ఇంకా స్పందించలేదు. భారత దేశం నుంచి మణిపూర్ను ఎవరూ విడదీయలేరని తెలిపారు. అవినీతిని పెంచి పోషించింది కాంగ్రెస్సేనని స్మృతి ధ్వజమెత్తారు. యుపిఎ హయాంలో ఎక్కువగా మహిళలపై అత్యాచారాలు జరిగాయని, ఆర్టికల్ 370 రద్దు వల్లనే రాహుల్ పాదయత్ర చేయగలిగారని, ఆర్టికల్ 370ని మళ్లీ తెస్తామని రాహుల్ చెబుతున్నారని, కశ్మీర్ పండిట్లకు జరిగిన అన్యాయాలు రాహుల్కు కనిపించడంలేదా? అని కేంద్ర మంత్రి ప్రశ్నించారు.
కాగా, అంతకు ముందు ప్రధాని నరేంద్ర మోదీ దృష్టిలో మణిపూర్ అల్లర్లు దేశంలో భాగం కాదని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఎద్దేవా చేశారు. ప్రధాని మోడీ మణిపూర్ను రెండు వర్గాలు విడగొట్టి.. భారత మాతను హత్య చేశారని దుయ్యబట్టారు. మణిపూర్ ప్రజలను చంపడం ద్వారా దేశాన్ని చంపేశారని రాహుల్ మండిపడ్డారు.
బిజెపోళ్లు దేశ భక్తులు కాదని దేశద్రోహులు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. బిజెపోళ్లు దేశాన్ని రక్షించే వారు కాదని… దేశ హంతకులు అని ధ్వజమెత్తారు. మణిపూర్ లో బిజెపోళ్లు తల్లులను హత్య చేశారని పేర్కొంటూ భారత సైన్యం తలుచుకుంటే మణిపూర్లో ఒక్క రోజులోనే శాంతి సాధ్యమని స్పష్టం చేశారు.
మోడీ మణిపూర్ మాట వినేందుకు ఇష్టపడడంలేదని, రావణులు కూడా కేవలం మేఘనాథుడు, కుంభకర్ణుడి మాటలే వినేవాడని, మోడీ కూడా అమిత్ షా, అదానీ మాటలే వింటున్నారని రాహుల్ విరుచుకపడ్డారు.