రాష్ట్రంలో 24 గంటల కరెంటు ఇస్తున్నట్టు నిరూపిస్తే రాజీనామా చేస్తానని కరీంనగర్ బీజేపీ ఎంపి బండి సంజయ్ సవాల్ విసిరారు. గురువారం లోక్‌సభలో అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా సంజయ్ మాట్లాడుతూ… కాంగ్రెస్, బిఆర్ఎస్పై తీవ్ర విమర్శలు చేశారు. అవిశ్వాసం ఎందుకు ప్రవేశపెట్టారో వారికే స్పష్టత లేదని మండిపడ్డారు.
`ప్రతిపక్ష పార్టీ నాయకుడి వ్యవహారం చూసిన తర్వాత ప్రపంచమంతా నవ్వుకుంటున్నారు. ముద్దులు పెడతారు.. ప్లైయింగ్ కిస్‌లు ఇస్తారు.. మరో సారి కౌగిలించుకుంటారు… ఒకసారి కన్ను కొడతారు. ఆయన వ్యవహార శైలి చూస్తే గజినీ గుర్తొస్తాడు’ అంటూ ధ్వజమెత్తారు.
`భరతమాతను హత్య చేశారంటున్నారు. భరతమాత వైపు కన్నెత్తి చూస్తే.. కళ్లు పీకి బొందపెట్టే ప్రధాని నరేంద్ర మోడీ ఇక్కడ ఉన్నారు. ప్రజల విశ్వాసం కోల్పోయిన వారే అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడితే ప్రజలు సహించే స్థితిలో లేరు’ అంటూ సంజయ్ హెచ్చరించారు.
`ఏ కాంగీ, బెంగాల్ కా దీదీ, దిల్లీ కా కేజీ, బిహార్ కా జేడీ, తెలంగాణ కా కేడీ. వీళ్లతోని ఏమీ కాదు. ప్రధానమంత్రి మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం శక్తిమంతమైన భారత దేశ నిర్మాణం కోసం కృషి చేస్తుంది. నా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి పెట్టిన దేవాలయం ఈ పార్లమెంట్ అని కొనియాడారు. ఇదే వేదికగా స్వర్గీయ సుష్మాస్వరాజ్. తెలంగాణ యువకులారా ఆత్మహత్యలు చేసుకోవద్దని పిలుపునిచ్చారు’ అంటూ చెప్పారు.
మీరు కోరుకున్న తెలంగాణను ఇవ్వడానికి మేం సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. మీరు తెలంగాణ ఇస్తారా? లేదంటే మేం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇస్తాం అని కాంగ్రెస్‌ను హెచ్చరిచారు. ఆ తర్వాత కాంగ్రెస్ బిల్లుపెడితే బిజెపి మద్దతుతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది’ అంటూ గుర్తు చేశారు.
అవినీతి యుపిఎ.. ఇండియాగా ఎలా మారిందో.. కుటుంబ పార్టీ అయిన టిఆర్ఎస్.. బిఆర్ఎస్గా మారిందని బండి సంజయ్ ఆరోపించారు. బిఆర్ఎస్ అంటే భష్టాచార్ రాక్షస సమితి…కెసిఆర్ అంటే ఖాసిం చంద్రశేఖర్ రిజ్వీ అని విమర్శించారు. 24 గంటలు కరెంటు ఇస్తున్నామని ఎంపి నామా నాగేశ్వరరావు చెప్పారు. తెలంగాణలో 24 గంటల కరెంటు ఇస్తున్నట్లు నిరూపిస్తే తాను రాజీనామా చేయడానికి సిద్ధమని వెల్లడించారు.