తెలంగాణ సమాజాన్ని మద్యానికి బానిసలుగా చేసిన ఘనత సిఎం కేసీఆర్‌కు దక్కుతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆరోపించారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తూ తెలంగాణలో ఒకే కుటుంబానికి మెజార్టీ మంత్రిత్వ శాఖలు దక్కాయని, ఒక కుటుంబం చేతిలో తెలంగాణ రాష్ట్రం బందీగా మారిందని ఆరోపించారు.
కల్వకుంట్ల కుటుంబం చేతిలో తెలంగాణ దోపిడికి గురవుతోందని మండిపడ్డారు. దేశంలో అత్యధికంగా అవినీతికి పాల్పడుతున్న రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని కిషన్ రెడ్డి ఆరోపించారు. వేల కోట్ల రుపాయలు అప్పుగా తెచ్చి వాటిలో కమిషన్ల రూపంలో దోచుకుంటోందని, దేశంలో అన్ని రాజకీయ పార్టీలకు ఫైనాన్స్ చేస్తున్నారని ధ్వజమెత్తారు.
ఎన్ని వేల కోట్ల రుపాయలు అక్రమంగా సంపాదించుకున్నారో తెలంగాణ ప్రజానీకం అంతా చూస్తున్నారని చెప్పారు. ప్రభుత్వం 30 పర్సెంట్ వాటాలు కుటుంబానికి వెళుతున్నాయని, ప్రశ్నించే గొంతుల్ని నొక్కి, పౌర హక్కుల్ని కాలరాస్తున్నాయని ఆరోపించారు. ఆందోళనలు, నిరసన కార్యక్రమాలు తెలిపే స్వేచ్ఛ లేకుండా చేశారని విమర్శించారు.
బీజేపీ కార్యకర్తలు ప్రజా సమస్యలపై పోరాడుతుంటే వాటికి అనుమతి ఇవ్వకుండా వేధిస్తున్నారని మండిపడ్డారు. ప్రజాస్వామ్య వ్యతిరేక ప్రభుత్వం బిఆర్ఎస్ అగ్రస్థానంలో ఉంటుందని పేర్కొన్నారు. యువత ఆశల్ని నీళ్లు చల్లి, నోటిఫికేషన్లు ఇవ్వడం పేపర్లు లీక్‌లతో నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటున్నారని ఆరోపించారు.