సామాజిక ఉద్యమకారుడు, ‘సులభ్ ఇంటర్నేషనల్’ వ్యవస్థాపకుడు బిందేశ్వర్ పాథక్ మంగళవారం కన్నుమూశారు. 80 ఏళ్ల వయసులో కార్డియాక్ అరెస్ట్‌తో ఢిల్లీలోని ఒక హాస్పిటల్లో తుదిశ్వాసం విడిచారని ఆయన సన్నిహితులు తెలిపారు.
పారిశుద్ధ్య కార్మికుల శ్రమను దోపిడీ చేస్తున్నారంటూ బిందేశ్వర్ పాథక్ దీర్ఘకాలంపాటు అలుపెరుగని పోరాటం చేశారు. మానవ వ్యర్థ్యాలను కార్మికులు శుభ్రపరచడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ఇందుకోసం తన ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ప్రచారం చేశారు.
ఏకంగా 1.3 బిలియన్ల కుటుంబాలకు టాయిలెట్లు నిర్మించారు. ఈయన సూచనలను పరిగణలోకి తీసుకొని ప్రభుత్వాలు పలు నిబంధనలను ప్రవేశపెట్టాయి. బిందేశ్వర్ పాఠక్ బిహార్ లోని వైశాలి జిల్లాలో ఉన్న రాంపూర్ బఘేలీ గ్రామంలో ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. విద్యాభ్యాసం అనంతరం 1970లో మహాత్మాగాంధీ స్ఫూర్తితో సులభ్ ఇంటర్నేషనల్ ను స్థాపించారు.
సులభ్ ఇంటర్నేషనల్ వ్యవస్థాపకుడు బిందేశ్వర్ పాఠక్ మరణంపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మృతి దేశానికి తీరని లోటు అన్నారు. బిందేశ్వర్ పాఠక్ సామాజిక సేవలో, అణగారిన వర్గాలకు సాధికారత కల్పించడంలో ఎంతో కృషి చేశారని ప్రధాని గుర్తు చేశారు. స్వచ్ఛ భారత్ కు తొలి అడుగులు వేసింది బిందేశ్వర్ పాఠక్ యేనని కొనియాడారు.
స్వాతంత్య్ర దినోత్సవం సందర్బంగా మంగళవారం ఉదయం కార్యాలయంలో బిందేశ్వర్ పాఠక్ జెండా వందనం చేశారని, ఆ తరువాత కాసేపటికే గుండెపోటుతో కుప్పకూలిపోయారని ఆయన సహచరులు తెలిపారు. వెంటనే ఆయనను ఢిల్లీ లోని ఎయిమ్స్ కు తరలించామని, అయితే, అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు తెలిపారని వెల్లడించారు.
పర్యావరణ కాలుష్యాన్ని నివారించడం కోసం పాఠక్ చేసిన కృషికి భారత ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డుతో సత్కరించింది. అదేవిధంగా పారిశుధ్యం, పరిశుభ్రత రంగంలో ఆయన చేసిన కృషికి వివిధ జాతీయ, అంతర్జాతీయ అవార్డులు వరించాయి. అప్పటి కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభు ఆధ్వర్యంలో రైలు ప్రాంగణంలో పరిశుభ్రతను పెంపొందించే లక్ష్యంతో 2016లో బిందేశ్వర్ స్వచ్ఛ రైలు మిషన్ కి బ్రాండ్ అంబాసిడర్ గా నియమితులయ్యారు.