చంద్రుడిని చేరడానికి ఉద్దేశించిన చంద్రయాన్ 3 ప్రయాణంలో మరో కీలక, క్లిష్టమైన ముందడుగు పడింది. చంద్రుడి చుట్టూ చేస్తున్న భ్రమణంలో చివరిదైన, చంద్రుడికి మరింత సమీపంలో ఉన్న ఐదవ కక్ష్యలోకి చంద్రయాన్ విజయవంతంగా మారింది. భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన చంద్రయాన్ ప్రాజెక్టులో మూడోదైన చంద్రయాన్ 3 ప్రయాణం చంద్రుడి వైపు సాఫీగా సాగుతోంది.
మంగళవారం అత్యంత కీలకమైన, అలాగే, క్లిష్టమైన ఒక కార్యక్రమం ముగిసింది. చందమామ కక్ష్యలో పరిభ్రమిస్తున్న చంద్రయాన్.. ఆ ప్రయాణంలో చివరిదైన ఐదవ కక్ష్యలోకి విజయవంతంగా చేరింది. అంటే, చంద్రుడి ఉపరితలానికి చంద్రయాన్ 3 మరింత దగ్గరైందన్న మాట.
ఈ చర్యతో చంద్రుడి చుట్టూ చేస్తున్న పరిభ్రమణాల్లో కక్ష్యల మార్పు కార్యక్రమం ముగిసి.. ల్యాండర్ మాడ్యూల్, ప్రొపల్షన్ మాడ్యుల్ లు విడిపోయి, వేరువేరుగా ప్రయాణం సాగించడమనే మరో కీలక ఘట్టానికి చంద్రయాన్ సిద్ధమవుతోంది. ఈ వివరాలను ఇస్రో వెల్లడించింది.
చంద్రయాన్ 3 ని విజయవంతగా 153 కిమీ x 163 కిమీ చంద్ర కక్ష్యలోకి ప్రవేశపెట్టడమనే కీలక ఘట్టం ముగిసింది. ఈ కార్యక్రమం పూర్తిగా ఆశించిన తీరులోనే కొనసాగిందని ఇస్రో ప్రకటించింది. ల్యాండర్ మాడ్యూల్, ప్రొపల్షన్ మాడ్యుల్ లు విడిపోయే కార్యక్రమం ఆగస్ట్ 17వ తేదీన జరుగుతుందని వెల్లడించింది.
చంద్రయాన్ 2 పాక్షికంగా విజయవంతమైన తరువాత.. ఈ సంవత్సరం జులై 14వ తేదీన చంద్రయాన్ 3 ని ప్రయోగించారు. ఇది ఆగస్ట్ 5వ తేదీన చంద్రుడి కక్ష్యలోకి విజయవంతంగా చేరింది. ఆ తరువాత క్రమంగా చంద్రుడి కక్ష్యలో మార్పులు చేసుకుంటూ, చంద్రుడి ఉపరితలానికిి దగ్గరైంది. ఆగస్ట్ 23వ తేదీన చంద్రయాన్ 3 చందమామపై దిగుతుంది.