తెలుగు రాష్ట్రాల్లో కీలకమై రైల్వే ప్రాజెక్టుల నిర్మాణానికి కేంద్ర మంత్రివర్గం అమోద ముద్ర వేసింది. ప్రధాన మంత్రి గతిశక్తిలో భాగంగా రైళ్ల రాకపోకల క్రమబద్ధీకరణతో పాటు రద్దీని తగ్గించడం కోసం గుంటూరు – బీబీనగర్, ముద్ఖేడ్- డోన్ మధ్య రైల్వే లైన్ల డబ్లింగ్ పనులకు అమోదం తెలిపింది. వీటితో పాటు దేశంలో ఏడు రైల్వే మల్టీట్రాకింగ్ ప్రాజెక్టు పనులకు కేంద్రం ఆమోదముద్ర వేసింది.
తెలుగు రాష్ట్రాల్లో గుంటూరు – బీబీనగర్, ముద్ఖేడ్- కర్నూలు జిల్లా డోన్ మధ్య రైల్వే లైన్ల డబ్లింగ్ ప్రాజెక్టులకు మొత్తం రూ.7,539.32 కోట్లు కేటాయించింది. గుంటూరు – బీబీనగర్ మధ్య 239 కి.మీ. మార్గాన్ని రైల్వే లైన్ డబ్లింగ్ పనులకు రూ.2,853.23 కోట్లు కేటాయించారు.
గుంటూరు – బీబీనగర్ మధ్య రైల్వే లైన్ డబ్లింగ్తో గుంటూరు, పల్నాడు ప్రాంతాలను ఒడిశా, ఇటు తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్రలతో అనుసంధానిస్తుంది. అంతేకాకుండా గుంటూరు- సికింద్రాబాద్ మధ్య ప్రత్యామ్నాయ రైలు మార్గాన్ని కూడా అందుబాటులోకి తెస్తుంది.
ప్రస్తుతం గుంటూరు-విజయవాడ-కాజీపేట- సికింద్రాబాద్ మార్గం రద్దీగా మారడంతో రైళ్ల రాకపోకలు ఆలస్యమవుతున్నాయి. దీనికి ప్రత్యామ్నాయంగా తక్కువ ప్రయాణ దూరంతో గుంటూరు- సికింద్రాబాద్ లైన్ అందుబాటులోకి వస్తుంది. ఈ ప్రాంతం మీదుగా ఇనుము, సిమెంట్, ఆహార, వాణిజ్య పంటల ఉత్పత్తుల రవాణాకు ఉపయోగపడుతుంది.
ముద్ఖేడ్ – డోన్ మధ్య 417.88 కి.మీ. మేర డబ్లింగ్ పనులకు రూ.4,686.09 కోట్లు ఖర్చు చేస్తారు. ఈ పనులు పూర్తయితే ఈ లైన్లలో కొత్త రైళ్లు ప్రవేశపెట్టడంతోపాటు గూడ్స్ రైళ్ల ద్వారా సరుకు రవాణాకు వీలవుతుంది. డబ్లింగ్ పనులు పూర్తైతే ఈ మార్గాల్లో పారిశ్రామిక, వ్యవసాయోత్పత్తుల వాణిజ్యం గణనీయంగా పెరుగుతుంది.
ఈ ప్రాజెక్టు పూర్తయితే రవాణా సదుపాయాలు మరింత మెరుగుపడి ప్రస్తుత మార్గాల్లో రద్దీ తగ్గుతుందని రైల్వే అధికారులు తెలిపారు. ఆహార ధాన్యా లు, ఇనుము, బొగ్గు, సిమెంట్ రవాణా పెరగడంతోపాటు చుట్టుపక్కల ప్రాంతాల్లోని ఇండస్ట్రియల్ కారిడార్లకు ప్రయోజనం చేకూరుతుందని చెప్పారు.
ముద్ఖేడ్ – డోన్ రైల్వే లైన్ ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాను తెలంగాణలోని మహబూబ్ నగర్ మీదుగా మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాతో అనుసంధానిస్తుంది. ప్రస్తుతం అత్యంత రద్దీగా ఉన్న బలార్షా- ఖాజీపేట- సికింద్రాబాద్ మార్గం, కాజీపేట- విజయవాడ మార్గానికి ప్రత్యామ్నాయ మార్గం అందుబాటులోకి వస్తుంది.
భద్రక్-విజయనగరం సెక్షన్‌లోని ఖుర్దా రోడ్-విజయనగరం మధ్య 363 కిలోమీటర్ల మేర మూడో లైన్ నిర్మాణానికి రూ.5,618 కోట్లకు కేంద్ర కేబినెట్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ ప్రాజెక్టులో భాగంగా ఒడిశాలోని భద్రక్, జాజ్‌పూర్, ఖుర్దా, కటక్, గంజాం జిల్లాలతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో మూడో రైల్వే లైన్ పనులు జరగనున్నాయి.