తెలంగాణ మంత్రి కే.టీ. రామారావు (కేటీఆర్) బస్సు యాత్రకు బదులు మోకాలి యాత్ర చేసినా ప్రజలు నమ్మరని బిజెపి ఓబీసీ మోర్చా జాతీయాధ్యక్షులు, ఎంపీ డా. కే. లక్ష్మణ్ స్పష్టం చేశారు. తెలంగాణలో కాంగ్రెస్‌కు ఓటేస్తే అది బీఆర్ఎస్కే చెందుతుందని ఆయన హెచ్చరించారు. గతంలో కాంగ్రెస్‌ను నమ్మి ఓటేస్ గెలిచిన వెంటనే వెళ్లి బీఆర్ఎస్లో కలిసిపోయారని గుర్తుచేశారు.
మరోవైపు కేంద్ర ప్రభుత్వం పేదల సొంతింటి కలను నిజం చేసేందుకు ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద అన్ని రాష్ట్రాలకు గృహాలను మంజూరు చేస్తే, తెలంగాణలో ఇంతవరకు ఒక్క లబ్దిదారుడికి కూడా ఇల్లు అందలేదని డా. లక్ష్మణ్ ధ్వజమెత్తారు. సొంతింటి కల నెరవేర్చలేకపోయిన బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రజలు తిరస్కరించడం ఖాయమని ఆయన తేల్చి చెప్పారు.
ఈ పరిస్థితుల్లో తెలంగాణలో బీజేపీ మాత్రమే ఏకైక ప్రత్యామ్నాయమని, ప్రజలు కచ్చితంగా తమను ఆదరిస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. మరోవైపు గురువారం జరిగిన బీజేపీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశంలో తెలంగాణ ప్రస్తావన రాలేదని తెలిపారు. ప్రస్తుతం మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో అభ్యర్థుల గురించి మాత్రమే చర్చ జరిగిందని వెల్లడించారు.
వచ్చే నెల మొదటి వారంలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై కసరత్తు ఉంటుందని తెలిపారు. తెలంగాణలో గెలుపు గుర్రాలను గుర్తించి అభ్యర్థులుగా నిలబెడతామని తెలిపారు. కాగా, సమాజంలో 50% కంటే ఎక్కువ సంఖ్యలో ఉన్న వెనుకబడిన వర్గాలు (ఓబీసీ) కోసమే కేంద్ర ప్రభుత్వం ‘పీఎం విశ్వకర్మ’ పథకాన్ని తీసుకొచ్చిందని డా. లక్ష్మణ్ తెలిపారు.
రూ. 13 వేల కోట్లతో 18 చేతివృత్తులను గుర్తించి సహకరించేందుకు ఈ పథకం రూపకల్పన జరిగిందని వెల్లడించారు. ఈ పథకం కింద చేతివృత్తి నిపుణులకు సర్టిఫికేట్‌తో పాటు గుర్తింపు కార్డ్ అందజేస్తామని, అలాగే ఆధునిక పరికరాల కోసం ఆర్థిక సహాయంతో పాటు ఎలాంటి పూచీకత్తు లేకుండా మొదటి విడతలో రూ. 1 లక్ష వరకు రుణ సహాయం అందించనున్నట్టు చెప్పారు.
రెండవ విడతలో ఈ రుణం రూ. 2 లక్షల వరకు పెంచనున్నట్టు తెలిపారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జన్మదిన కానుకగా సెప్టెంబర్ 17న ఈ పథకాన్ని అమల్లోకి తీసుకురానున్నట్లు వెల్లడించారు.