సాధారణంగా రాజకీయ పార్టీలు ఎన్నికల తేదీలు ప్రకటించిన తర్వాత అభ్యర్థులను ప్రకటిస్తుంటాయి. కొన్ని సందర్భాల్లో నామినేషన్ల దాఖలు వరకు కూడా సస్పెన్స్ కొనసాగుతూ ఉంటుంది. కానీ, బీజేపీ మాత్రం ఈ సారి ఈ ఎన్నికల ప్రకటనకు ముందే అభ్యర్థులను ప్రకటించే సంప్రదాయానికి తెర లేపింది.
ఈ సంవత్సరం మధ్య ప్రదేశ్, చత్తీస్ గఢ్ రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్నాయి. త్వరలో ఈ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల కమిషనర్ ఎన్నికల షెడ్యూల్ ను విడుదల చేయనుంది. అయితే, ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ముందే అభ్యర్థులను ప్రకటించి బీజేపీ చరిత్ర సృష్టించింది.
చత్తీస్ గఢ్ అసెంబ్లీలో 90 స్థానాలు ఉంటాయి. అందులో తొలి విడతగా 21 మంది అభ్యర్థులను బీజేపీ గురువారం ప్రకటించింది. అలాగే, 230 సీట్లున్న మధ్య ప్రదేశ్ అసెంబ్లీకి సంబంధించి 39 నియోజకవర్గాలకు తొలి జాబితా అభ్యర్థులను ప్రకటించింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం ఢిల్లీలో బీజేపీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం జరిగింది. బీజేపీ అభ్యర్థుల ఎంపిక వ్యవహారాలను, ప్రచార వ్యూహాలకు సంబంధించిన విషయాలను ఈ కమిటీనే పర్యవేక్షిస్తుంటుంది.
ఆ కమిటీ సమావేశంలో మధ్యప్రదేశ్, చత్తీస్ గఢ్ అభ్యర్థుల ఎంపికపై చర్చ జరిగిందని, వివాదం లేని స్థానాల్లో అభ్యర్థులను వెంటనే ప్రకటించాలని నిర్ణయించారని పార్టీ వర్గాలు తెలిపాయి. అంతేకాకుండా, అభ్యర్థుల పేర్లను ముందే ప్రకటించడం వల్ల ఆయా నియోజకవర్గాల్లో అభ్యర్థిత్వం ఆశించి భంగపడ్డ అసంతృప్త నేతలను బుజ్జగించడానికి, వారికి వేరే పదవులు ఆఫర్ చేయడానికి సమయం లభిస్తుందని పార్టీ అధినాయకత్వం భావించిందని వెల్లడించారు.
కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాజస్థాన్లో అసెంబ్లీ అభ్యర్థుల ఎంపిక కోసం భారతీయ జనతా పార్టీ రెండు కీలక ఎన్నికల కమిటీలను ప్రకటించింది. 21మంది సభ్యులుండే ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీకి మాజీ ఎంపి నారాయణ్ పంచారియా నేతృత్వం వహించనున్నారు. అలాగే సంకల్ప్ పత్ర కమిటీగా పిలవబడే ఎన్నికల మేనిఫెస్టో కమిటీకి కేంద్ర మంత్రి అర్జున్ మేఘ్వాల్ నేతృత్వం వహిస్తారు.
ఈ రెండు ఎన్నికల కమిటీల్లోను వసుంధరా రాజెకు చోటు కల్పించకపోవడం గురించి బిజెపి రాష్ట్ర ఇన్చార్జి అరుణ్ సింగ్ను ప్రశ్నించగా, ఆమె ఎన్నికల్లో ప్రచారం చేస్తారని చెప్పారు. ‘ఆమె పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు. ఆమె పెద్ద పాత్ర పోషించాల్సి ఉంది. ఆమె రాష్ట్రానికి రెండు సార్లు ముఖ్యమంత్రిగా కూడా ఉన్నారు. ఆమె ఎన్నికల్లో ప్రచారం చేస్తారు. మేమంతా ఆమెను గౌరవిస్తాం’ అని అరుణ్ సింగ్ విలేఖరులతో పేర్కొన్నారు.