భారతదేశపు ఇస్రోకు చెందిన చంద్రయాన్ 3, రష్యాకు చెందిన లూనా 25 వ్యోమనౌకలు దాదాపుగా ఏకకాలంలోనే చంద్రుడిపై సజావుగా దిగేందుకు రంగం సిద్ధమైంది. 1976లో అప్పటి సోవియట్ యూనియన్ ద్వారా ప్రయోగిత లూనా 24 తరువాత చైనాకు చెందిన ఛాంగ్ 3 2013లో , ఆ తర్వాత ఛాంగ్ 4 2018లో చంద్రుడిపైకి వెళ్లాయి.
అప్పటి నుంచి అక్కడ వ్యోమనౌకల ఆగమనం జరగలేదు. ఇప్పుడు విచిత్రమైన రీతిలో భారత్ చంద్రయాన్‌కు, రష్యా లూనాకు పోటీ నెలకొంది. రేస్‌లో ముందు చంద్రయాన్ 3 జాబిల్లిపై వాలుతుందని భావించారు. అయితే దీనిని లూనా 25 వెనకకు నెట్టివేసింది. ఈ నెల 21నే చంద్రయాన్‌కు ముందుగానే లూనా 25 చంద్రుడిపై వాలనుంది.
చంద్రయాన్ 3 నిర్ణీత దశ ప్రకారం ఈ నెల 23న చంద్రుడిపై చేరనుంది. ఇప్పటివరకు ఏ వ్యోమనౌక వెళ్లని చంద్రుడి దక్షిణ ధృవాన్ని ఎంచుకునే ఈ రెండు వ్యోమనౌకలు తమ లక్షాలను ఖరారు చేసుకున్నాయి. మనకు కన్పించే చంద్రుడికి ఆవలి వైపున ఉండే దక్షిణ ప్రాంతపు ఆవిష్కరణతో జాబిల్లిలోని పలు అపార అంతులేని రహస్యాలు వెలుగులోకి వస్తాయని ఇస్రో శాస్త్రజ్ఞులు అంచనా వేస్తున్నారు.
అయితే చంద్రుడిపై ప్రయోగాల దిశలో సీనియర్ అయిన రష్యా లూనా శ్రేణి ప్రయోగాలతో చంద్రుడిని అత్యంత వేగంగా చేరుకుంటోంది. చంద్రయాన్‌తో పోలిస్తే ఇది ఎక్కువ స్పీడ్‌లో ఉంది. మరో విశేషం ఏమిటంటే చంద్రుడిపై వచ్చి వాలే ఈ భూగోళ అతిధులు చంద్రయాన్ 3, లూనా 25లు దాదాపుగా అత్యంత సమీపంలోనే నిలుస్తాయి. చంద్రుడిపైకి ప్రయోగాల క్రమంలో ఇప్పటి వరకు రష్యా, అమెరికా, చైనా సరసన ఇండియా కూడా చేరేందుకు వీలేర్పడింది.
లూనా 25 అత్యంత శక్తివంతమైన రాకెట్‌గా నిలిచింది. ఈ నెల 10వ తేదీన దీనిని ప్రయోగించారు. కేవలం ఆరు రోజుల వ్యవధిలోనే ఇది చంద్రుడి కక్ష్యలోకి చేరింది. అదే చంద్రయాన్ 3 జులై 14న పరీక్షించగా ఇది ఈ దశకు చేరుకోవడానికి 23 రోజులు పట్టింది. చంద్రుడి పరిధిలోకి నేరుగా వెళ్లే శక్తివంతమైన రాకెట్‌ను ఇస్రో పూర్తి స్థాయిలో సంతరించుకోలేదు.
పూర్తిగా వలయంగా తిరిగి ఇది చంద్రుడి వద్దకు చేరుకునే స్థాయిలో ఉంది. అయితే ఈ క్రమంలో చంద్రయాన్ 3 వ్యోమనౌకకు అయ్యే ఇంధనం, వ్యయభారం తక్కువ. ఇదే దశలో లూనా 25 ఇందుకు విభిన్నం. ఇది నేరుగా చంద్రుడివైపే దూసుకుపోగల శక్తిని సంతరించుకుంది. షార్ట్కట్స్లేకుండా వలయాకార మార్గాలు కాకుండా ముందుకు సాగింది.
అయితే ఇప్పుడు రెండూ ఏకకాలంలోనే చంద్రుడి కక్షలోనే ఉన్నాయి. చంద్రయాన్ 3 కన్నా ముందు ఇది చంద్రుడిపై వాలినా వచ్చే ప్రయోజనం ఏమీ ఉండదు. పైగా చంద్రుడిపై ఈ వ్యోమనౌకలు వాలే విషయాన్ని ఇతర అంశాలు కూడా నిర్థారిస్తాయి.
చంద్రయాన్ 3 దక్షిణ ధృవానికి సమీపంలోనే వాలుతుంది. అయితే నిజానికి ఇది పూర్తిగా దక్షిణ ధృవం కాదు. ఇది వాలే ప్రాంతం చంద్రుడి దక్షణ రేఖాంశంపై దాదాపు 68 డిగ్రీలు ఏటవాలుగా ఉంటుంది. లూనా 25 దక్షణ ప్రాంతంలో దాదాపు 70 డిగ్రీల సమీపంలో ఉంటుంది. ఈ క్రమంలో ఈ రెండూ ప్రయోగాలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ఇంతవరకూ చంద్రుడిపైకి వెళ్లిన వ్యోమనౌకలు ఎక్కువగా చంద్రుడి మధ్య ప్రాంతాన్ని ఎంచుకున్నాయి.