కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)లో భారీగా మార్పులు చేసింది అధిష్టానం. త్వరలో ఎన్నికల జరగనున్న నేపథ్యంలో కీలక నిర్ణయాలు తీసుకునే సీడబ్ల్యూసీలో మార్పులు చేశారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఆదివారం కొత్త కమిటీని ప్రకటించారు.
మల్లిఖార్జున ఖర్గే, సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్, రాహుల్ గాంధీ, ఏకె ఆంటోనీ, అధిర్ రంజన్ చౌదురి, అంబికా సోనీ, మీరా కుమార్, దిగ్విజయ్ సింగ్, పి చిదంబరం, ప్రియాంక గాంధీ, తారీఖు అన్వర్, లాల్‌థన్‌వాలా, ముకుల్ వాస్నిక్, ఆనంద్ శర్మ, అశోక్‌రావు చవాన్, అజయ్ మకెన్, చరణ్‌జిత్ సింగ్ ఛన్నీ, కుమారీ సెల్జా, గైకంగమ్, ఎన్ రఘువీరా రెడ్డి, శశిథరూర్, తమర్థ్‌వాజ్ సాహూ, అభిషేక్ మనూ సింఘ్వీ, సల్మాన్ ఖుర్షీద్, సల్మాన్ ఖుర్షీద్, జితేంద్ర సింగ్, రణదీప్ సింగ్ సూర్జేవాలా , సచిన్ పైలట్, దీపక్ బబారియాలు సభ్యులుగా నియమితులు అయ్యారు.
2024 లోక్‌సభ ఎన్నికలు దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది. సీడబ్ల్యూసీకి ఎన్నికలు నిర్వహించకూడదని కాంగ్రెస్ ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకుందని, నియామకాలను అధ్యక్షుడు ఖర్గే మాత్రమే చేపడతారని కాంగ్రెస్ కమ్యూనికేషన్స్ చీఫ్ జైరాం రమేష్ స్పష్టం చేశారు.
మొత్తం 84 మంది సభ్యుల జాబితాలో 39 మందిని సీడబ్ల్యూసీ జనరల్ సభ్యులుగా ప్రకటించారు. 18 మందిని సీడబ్ల్యూసీ శాశ్వత ఆహ్వానితులుగా, 14 మందిని ఇన్ ఛార్జ్ లుగా, 9 మందిని ప్రత్యేక ఆహ్వానితులు, 4గురిని ఎక్స్అఫిషియో సభ్యులుగా నియమించారు.
కాంగ్రెస్ అసమ్మతి వర్గంగా పేరొందిన జీ23 నేతలు శశిథరూర్, ఆనంద్ శర్మ, ముకుల్ వాస్నిక్ వంటి నేతలకు సీడబ్ల్యూసీలో చోటుకల్పించారు. సచిన్ పైలట్‌తో పాటు దీపా దాస్ మున్షి, సయ్యద్ నసీర్ హుస్సేన్‌లను సీడబ్ల్యూసీలోకి తీసుకున్నారు.
తెలుగు రాష్ట్రాల నుంచి సీడబ్ల్యూసీ జనరల్ సభ్యుల జాబితాలో ఆంధ్రప్రదేశ్ నుంచి మాజీ మంత్రి రఘువీరారెడ్డికి అవకాశం లభించింది. శాశ్వత ఆహ్వానితులుగా టి.సుబ్బరామిరెడ్డి, కె.రాజు, దామోదర రాజనర్సింహలకు అవకాశం లభించింది. ప్రత్యేక ఆహ్వానితులుగా పల్లంరాజు, వంశీచంద్ రెడ్డి ఉన్నారు.