చంద్రుడు, అంగారక గ్రహం, శుక్రగ్రహాలపైకి ప్రయాణించే సత్తా భారత్‌కు ఉందని భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) చీఫ్ ఎస్ సోమనాథ్ భరోసా వ్యక్తం చేశారు. అయితే మనలో ఆత్మవిశ్వాసం పెంచుకోవాల్సిన అవసరం ఉందని చెబుతూ అంతరిక్ష రంగం అభివృద్ధికి మరిన్ని పెట్టుబడులు అవసరమని ఇస్రో చీఫ్ పేర్కొన్నారు.
చంద్రయాన్-3 ప్రయోగం విజయవంతంకావడంతో కేరళలోని ఆలయంలో ఆదివారం పూజలు నిర్వహించారు. పౌర్ణమికావు భద్రకాళి ఆలయానికి చేరుకున్న ఆయన.. అమ్మవారిని దర్శించుకొని.. మొక్కులు చెల్లించారు. అంతరిక్ష రంగాన్ని అభివృద్ధి చేయడమే తమ ధ్యేయమని చెబుతూ దేశం మొత్తం అభివృద్ధి చెందాలని పేర్కొన్నారు. ప్రధాని మోదీ విజన్‌ను నెరవేర్చేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు.
తాను అన్వేషకుడినన్న ఇస్రో చైర్మన్.. సైన్స్, ఆధ్యాత్మిక రెండింటినీ అన్వేషించడం తన జీవిత ప్రయాణంలో ఓ భాగమని తెలిపారు. అనేక ఆలయాలను సందర్శిస్తానని, గ్రంథాలను చదువుతానని చెప్పారు. విశ్వాసాన్ని పెంచుకోవడం ద్వారా ప్రతి గ్రహానికి ప్రయాణించగలమని స్పష్టం చేశారు.
చంద్రయాన్-3 ప్రయోగంపై స్పందిస్తూ.. ప్రస్తుతం ల్యాండర్, రోవర్ బాగా పని చేస్తున్నాయని తెలిపారు. చంద్రయాన్-3 బోర్డులో ఏర్పాటు చేసిన ఐదు పరికరాలు డేటాను అందిస్తున్నాయని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో అన్ని ప్రయోగాలను పూర్తి చేస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇలా ఉండగా, చంద్రయాన్-3 ఫలితాలు ప్రపంచం ముందుకు వస్తున్నాయి. చంద్రుని దక్షిణ ధ్రువంపై ఉష్ణోగ్రతల తీరు మొదటిసారి తెలిసింది. చంద్రునిపైగల నేల ఉష్ణోగ్రతలు, చంద్రుని ఉపరితలంలో 10 సెంటీమీటర్ల లోతులో ఉష్ణోగ్రతలు ఏ విధంగా ఉంటాయో వెల్లడైంది.
ఈ నెల 23న విజయవంతంగా చంద్రునిపై దిగిన విక్రమ్ ల్యాండర్‌లోని ఛేస్ట్ పేలోడ్ పంపించిన ఈ తొలి ఫలితాలను భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఆదివారం వెల్లడించింది. చంద్రుని దక్షిణ ధ్రువం వెంబడి ఉపరితలంలోని నేల ఉష్ణోగ్రతల తీరును ఛేస్ట్ (చంద్రాస్ సర్ఫేస్ థర్మోఫిజికల్ ఎక్స్పెరిమెంట్) కొలిచిందని ఇస్రో తెలిపింది. దీని ఆధారంగా చంద్రుని ఉపరితలంపై ఉష్ణోగ్రతలు మారే తీరును అర్థం చేసుకోవచ్చునని తెలిపింది.
అంటే, వేడి తగిలినపుడు ఏదైనా వస్తువు ఏ విధంగా స్పందిస్తుందో తెలుసుకోవచ్చు. పరిసరాల నుంచి వచ్చే వేడిని ఏదైనా వస్తువు స్వీకరించినపుడు దాని ఉష్ణోగ్రత పెరుగుతోందా? లేదా? వంటి విషయాలను తెలుసుకోవచ్చు.
చంద్రుని ఉపరితలంలో 10 సెంటీమీటర్ల లోతు వరకు చొచ్చుకెళ్లి ఉష్ణోగ్రతలను కొలిచేందుకు తగిన పరికరాలను ఛేస్ట్లో అమర్చినట్లు ఇస్రో తెలిపింది. ఉపరితలం నుంచి క్రిందికి చొచ్చుకెళ్లే ప్రక్రియ నియంత్రణతో జరుగుతుందని తెలిపింది. దీనికి విడివిడిగా 10 టెంపరేచర్ సెన్సర్లను అమర్చినట్లు తెలిపింది.