తెలంగాణలో కేసీఆర్ పాలనకు నూకలు చెల్లాయని, వచ్చెడిది బిజెపి ప్రభుత్వమని కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా భరోసా వ్యక్తం చేశారు. ఖమ్మంలో “రైతు గోస- బీజేపీ భరోసా” అనే పేరుతో నిర్వహించిన భారీ బహిరంగ సభలో మాట్లాడుతూ త్వరలో భద్రాచలం స్వామి వారికి బీజేపీ సీఎం పట్టువస్త్రాలు సమర్పిస్తారని వెల్లడించారు. ఈసారి కేసీఆర్, కేటీఆర్ సీఎం కాలేరని జోస్యం చెప్పారు.
కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండూ కుటుంబ పార్టీలని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపాలని పిలుపిచ్చారు. కాంగ్రెస్ పార్టీ సోనియా కుటుంబం కోసం పనిచేస్తుంటే బీఆర్ఎస్ కల్వకుంట్ల కుటుంబం కోసం పనిచేస్తోందని అమిత్ షా విమర్శలు చేశారు. తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేసిన వారి కలలను సీఎం కేసీఆర్ కల్లలు చేశారని ధ్వజమెత్తారు.
రైతు, దళిత, మహిళా వ్యతిరేక కేసీఆర్ ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపాలని చెబుతూ శ్రీరామనవమికి భద్రాచలంలో పాలకులు వస్త్రాలు సమర్పించే సంప్రదాయాన్ని కేసీఆర్ విస్మరించారని మండిపడ్డారు. కేసీఆర్ కారు భద్రాచలం వెళ్తుంది కానీ ఆలయం వరకు వెళ్లదని చెబుతూ కేసీఆర్ కారు స్టీరింగ్ ఎంఐఎం నేత ఒవైసీ చేతుల్లో ఉందని అమిత్ షా ఆరోపించారు. కేసీఆర్ కారు ఇకపై భద్రాచలం వెళ్లాల్సిన అవసరం లేదని, త్వరలోనే బీజేపీ సీఎం భద్రాచలంలో స్వామికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారని తేల్చి చెప్పారు.
కేసీఆర్‌తో కలిసే ప్రసక్తే లేదని అమిత్ షా స్పష్టం చేశారు. ఓవైసీ ఉన్న వేదికను కూడా కనీసం పంచుకోబోమని చెబుతూ కేసీఆర్ సర్కారుకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యిందని, రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది 4జీ, 3జీ, 2జీ పార్టీలు కాదని.. ప్రజల పార్టీ అయిన బీజేపీనే అని అమిత్ షా పేర్కొన్నారు.
కేసీఆర్, బీజేపీ ఏకమవుతాయని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే శనివారం చేవెళ్లలో జరిగిన బహిరంగసభలో చెప్పడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తూ తెలంగాణ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని విమరించారు. కేసీఆర్ పక్కన ఒవైసీ ఉన్నారన్న సంగతి అందరికీ తెలిసిందేని అని, అలాంటి కేసీఆర్‌తో కలిసే ప్రసక్తే లేదని అమిత్ షా స్పష్టం చేశారు. రైతు, దళిత, మహిళా వ్యతిరేక కేసీఆర్ సర్కారును కూకటివేళ్లతో పెకిలించి ఇంటికి సాగనంపాలని అమిత్ షా విజ్ఞప్తి చేశారు.
అరెస్ట్‌లతో బిజెపి నేతలను భయపెట్టొచ్చని కేసీఆర్ భావిస్తున్నారని ధ్వజమెత్తారు. బిజెపి నేతలు కిషన్ రెడ్డి, బండి, ఈటెలను అరెస్టులతో భయపెట్టాలని కెసిఆర్ చూస్తున్నారని చెబుతూ బీజేపేని భయపెట్టడం కేసీఆర్ వల్లకాదని హెచ్చరించారు.
బీఆర్ఎస్ పాలనలో వ్యవసాయం నిర్వీర్యమైందని కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి విమర్శించారు. కేసీఆర్ సర్కార్ వ్యవసాయ సబ్సిడీలు ఇవ్వడం లేదని ఆరోపించారు. వరి వేయొద్దని కేసీఆరే రైతులకు చెబుతున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో 75 శాతం కౌలు రైతులు ఉన్నారని, వ్యవసాయ రుణాలు పావలా వడ్డీకి ఇవ్వట్లేదని విమర్శించారు.
రాష్ట్రంలో కౌలు రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్న కిషన్ రెడ్డి… రుణమాఫీలు నామమాత్రంగా చేస్తున్నారని చెప్పారు. కేసీఆర్ రైతులను వెన్నుపోటు పొడిచారని అంటూ కోటి ఎకరాలకు సాగునీరు ఇస్తామన్న కేసీఆర్ హామీ ఏమైందని కిషన్ రెడ్డి ప్రశ్నించారు.