తమిళనాడు మంత్రి ఉదయనిధి సనాతన ధర్మంపై విద్వేష పూరితంగా, అవమానకరంగా మాట్లాడటం పట్ల బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డా. కె లక్ష్మణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సనాతన ధర్మం మలేరియా, డెంగ్యూ వంటిదని, ఆ ధర్మాన్ని నిర్మూలించాలని, నాశనం చేయాలని వ్యాఖ్యలు చేయడం దుర్మార్గం అంటూ ధ్వజమెత్తారు.
మలేరియా, డెంగ్యూ లాంటి వ్యాధులతో పోల్చి యావత్ హిందువులను అవమానపర్చారని పేర్కొంటూ కాంగ్రెస్ లాంటి కొన్ని పార్టీలు కూడా ఆయన వ్యాఖ్యలను సమర్థిస్తూ 100 కోట్ల మంది హిందువులను అవమానపర్చుతున్నాయని మండిపడ్డారు. వన్ నేషన్-వన్ ఎలక్షన్ గురించి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అనవసర విమర్శలతో బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారు తప్పితే సనాతన ధర్మాన్ని కించపర్చే వారి గురించి మాత్రం ఎందుకు సమర్థిస్తున్నట్లు? అని ప్రశ్నించారు.
కాంగ్రెస్ వ్యవహరిస్తున్న వైఖరి పట్ల సనాతన ధర్మాన్ని విశ్వసించే హిందువులు, ప్రజలు ఆలోచించుకోవాలని పేర్కొంటూ రాజకీయాలకు అతీతంగా బుద్ధి చెప్పాలని డా. లక్ష్మణ్ కోరారు. కుహనా లౌకికవాదం ముసుగులో కాంగ్రెస్ చేసే రాజకీయాలకు బుద్ధి చెప్పే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని హెచ్చరించారు.
గజినీ నుంచి మొదలుకొని మొగలులు, తురుష్కులు, అక్బర్, ఔరంగజేబు, నిజాంలు, మతోన్మాద మజ్లిస్ పార్టీలు, రాజకీయ రజాకార్ల వారసులు అనేక సందర్భాల్లో హిందూ ధర్మంపై దాడికి ప్రయత్నించారని గుర్తు చేశారు. ఆలయాలను, మందిరాలపై దాడికి పాల్పడ్డారని చెప్పారు. దేశంపై, ధర్మంపై చేసిన దాడులు ఆనాటి నుంచి జరుగుతున్నవే అయినా సనాతన ధర్మం ఎక్కడా చెక్కుచెదరకుండా కాపాడుకున్నామని తెలిపారు.
తమిళనాడు ప్రభుత్వ అధికారిక చిహ్నం(ఎంబ్లమ్)లోనే ఆలయం ముద్రణ ఉంటుందని గుర్తు చేస్తూ మీకు దమ్ముంటే ఆ చిహ్నాన్ని తీసేయండి అంటూ స్టాలిన్ ప్రభుత్వానికి సవాల్ విసిరారు. అప్పుడు సనాతన ధర్మాన్ని విశ్వసించే వారంతా మీకు సరైన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.
మందిరాలు, ఆలయాల నుంచి వచ్చే ఆదాయంతో ఖజానా నింపుకునే మీరు.. హిందూ ధర్మం గురించి నీచంగా వ్యాఖ్యలు చేయడం దారుణం అని విమర్శించారు. సనాతన ధర్మం ఆచరించే వారి ఓట్లు మీకు అక్కర్లేవా? స్టాలిన్ సమాధానం చెప్పాలని నిలదీశారు. ప్రతిపక్ష పార్టీల కూటమిలో డీఎంకే ముఖ్యమైన భాగస్వామి అని, కాంగ్రెస్తో ఆ పార్టీకి సుదీర్ఘకాలం నుంచి మైత్రి ఉందని గుర్తు చేశారు.
సనాతన ధర్మంపై మీ కూటమి పార్టీల్లో నాయకుడు వ్యంగంగా, నీచంగా మాట్లాడితే.. కనీసం ఎందుకు నోరు మెదపలేదో రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలని లక్ష్మణ్ డిమాండ్ చేశారు. మైనారిటీ సంతుష్టీకరణ విధానాల కోసం, కేవలం ముస్లంల ఓట్ల కోసం హిందువులను అవమానపర్చడం, అవహేళన చేయడం దుర్మార్గం అంటూ ధ్వజమెత్తారు.
టెర్రరిజాన్ని కట్టడి చేయాలని ప్రపంచ దేశాలు భావిస్తుంటే కాంగ్రెస్ మాత్రం సాఫ్రాన్ టెర్రరిజం అంటూ ప్రపంచాన్ని తప్పుదోవ పట్టిస్తోందని చెబుతూ కాంగ్రెస్ విషపూరిత చర్యలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. సనాతన ధర్మంపై విషం కక్కిన ఉదయనిధి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేకుంటే డీఎంకే పార్టీకి, ఆ పార్టీతో అంటకాగే కాంగ్రెస్ వంటి పార్టీలకు ప్రజలే బుద్ధి చెబుతారని స్పష్టం చేశారు.