గత పాలకుల పాలనలో ఆర్ధిక నేరస్థుల గడ్డగా ఉన్న మీరట్ ఇప్పుడు క్రీడాకారుల గడ్డగా మారినదని పేర్కొంటూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అఖిలేష్ యాదవ్ పాలనపై ధ్వజమెత్తారు. మీరట్ లో రూ 700 కోట్ల వ్యయంతో నిర్మించ తలపెట్టిన మేజర్ ధ్యాన్‌చంద్ క్రీడా విశ్వవిద్యాలయానికి ఆదివారం శంకుస్థాపన చేశారు.
ఒకప్పుడు నేరస్తులు మీరట్ పరిసర ప్రాంతాల్లో ‘అక్రమ స్వాధీన’ టోర్నీలు ఆడేవారని ప్రధాని ఎద్దేవా చేశారు. నేరగాళ్ల భయంతో ప్రజలు పారిపోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని, సాయంత్రం దాటినా అక్కాచెల్లెళ్లు, కూతుళ్లు ఇళ్ల నుంచి బయటకు రాలేని పరిస్థితి ఉండేదని పేర్కొన్నారు.
యువకుల చిలిపి చేష్టల్ని సీరియస్‌గా తీసుకోవద్దంటూ ఎస్పి వ్యవస్థాపకుడు ములాయంసింగ్ గతంలో చేసిన వాఖ్యాలను ప్రస్తావిస్తూ అలా సమర్థించడం సరైంది కాదని ప్రధాని హితవు పలికారు.
విప్లవకారుల నగరంగా ఉన్న మీరట్ ఇప్పుడు క్రీడాకారుల నగరంగానూ గుర్తింపు తెచ్చుకుంటుందని చెప్పారు. ఈ సందర్భంగా గత ప్రభుత్వ పనితీరుపై మోదీ విమర్శలు చేశారు. ‘‘గతంలో ఇక్కడ భూ ఆక్రమణల టోర్నమెంట్లు జరిగేవి. స్వేచ్ఛగా తిరిగే ఆడపిల్లలపై కొంతమంది అసభ్య వ్యాఖ్యలు చేసేవారు. యోగి ప్రభుత్వం ఇప్పుడు అలాంటి వాళ్లను జైలుకు పంపుతోంది’’ అని మోదీ పేర్కొన్నారు.
‘‘యూపీ యువత క్రీడా ప్రపంచంలో తమ ఉనికిని చాటుకునే అవకాశాన్ని పొందుతున్నారు. గత ప్రభుత్వాల వల్ల శిక్షణ నుంచి జట్టు ఎంపిక వరకు ప్రతి స్థాయిలో బంధుప్రీతి, కులతత్వం, అవినీతి, వివక్ష వంటి వాటితో క్రీడా ప్రపంచం నష్టపోయింది’’ అని ప్రధాని విమర్శించారు.
అయితే రాష్ట్రంలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానంద్ నేతృత్వంలోని బీజేపీ సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ నేరగాళ్లను ‘జైలు’లో పెట్టి అడుకుంటున్నారని అంటూ ప్రధాని యోగి ప్రభుత్వంపై ప్రశంసలు కురిపించారు. నేరగాళ్లు, మాఫియా నేతలను యోగి ప్రభుత్వం జైళ్లకు పంపడంతో ఇప్పుడు వారు (మహిళలు) స్వేచ్ఛగా బయటకు వస్తూ దేశం కోసం బహుమతులు తెస్తున్నారని ప్రధాని కొనియాడారు.
మీరట్, దాని పరిసర ప్రాంతాలు స్వతంత్ర భారత దేశానికి నూతన దిశానిర్దేశం చేస్తున్నాయని, దేశ రక్షణ, క్రీడా రంగాల్లో దేశ భక్తి జ్వాలను రగిలిస్తున్నారని ప్రధాని కొనియాడారు.