ఉద్యోగుల బదిలీలకు సంబంధించి ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన 317 జీవోను సవరించాలంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఆదివారం సాయంత్రం కరీంనగర్లో తన కార్యాలయంలో తలపెట్టిన జాగరణ దీక్ష తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. పోలీసుల లాఠీఛార్జీలు, తోపులాటలతో ఎంపీ ఆఫీసు యుద్ధక్షేత్రాన్ని తలపించింది.
కార్యాలయం లోపలి నుంచి తాళం వేసుకుని సంజయ్ దీక్షకు దిగగా.. రాత్రి 10 గంటల సమయంలో తలుపులు బద్ధలు కొట్టి లోనికి ప్రవేశించిన పోలీసులు ఆయన్ను బలవంతంగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. దీంతో సంజయ్ అక్కడే రాత్రంతా దీక్ష కొనసాగించారు.
ఒమిక్రాన్ విజృంభిస్తున్న నేపథ్యంలో సభకు అనుమతి లేదని, నిర్వహించవద్దని పోలీసులు ఉదయమే నోటీసులు జారీచేశారు. అయినా పెద్దయెత్తున కార్యకర్తలు దీక్షా స్థలానికి చేరుకోవడంతో పోలీసులు వచ్చినవారిని వచ్చినట్లుగా అరెస్టు చేశారు. సాయంత్రానికి భారీ సంఖ్యలో కార్యకర్తలు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు సైతం గుమిగూడటంతో పోలీసులు పలుమార్లు లాఠీలకు పనిచెప్పారు.
కార్యకర్తలను చెదరగొట్టేందుకు స్వయంగా పోలీస్ కమీషనర్ సత్యనారాయణ కూడా లాఠీఛార్జి చేశారు. సంజయ్ ను అక్కడకు రానీయకుండా కట్టడి చేసే ప్రయత్నం చేసినా మోటార్ బైక్ పై పోలీసుల కళ్లుగప్పి తన కార్యాలయం లోపలకు వెళ్లి, లోపలి నుండి తాళం వేసుకొని, వందమందికి పైగా పార్టీ నేతలతో కలసి దీక్షను ప్రారంభించారు.
కిటికీలో నుంచి మాట్లాడుతూ.. కేసీఆర్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. తనను, టీచర్లను, కార్యకర్తలను ఇబ్బంది పెట్టిన కేసీఆర్‌కు గుణపాఠం చెబుతామని స్పష్టం చేశారు. సంజయ్ దీక్షను భగ్నం చేసేందుకు రాత్రి 10.గంటల సమయంలో తలుపులు పగలగొట్టేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. ఇంకొందరు పోలీసులు కిటికీల్లోంచి స్ప్రింక్లర్ల ద్వారా లోపలికి నీటిని చిమ్మడంతో కార్యకర్తలు చెల్లాచెదురయ్యారు.
తొలుత గ్యాస్ కట్టర్లతో గేట్లు తొలగించి, అనంతరం గునపాలతో తలుపులు తెరిచారు. తలుపులు తెరుచుకోకుండా కార్యకర్తలు లోపలి నుంచి తీవ్రంగా ప్రతిఘటించారు. ఎట్టకేలకు తలుపులు తెరిచిన పోలీసులు సంజయ్‌ని బలవంతంగా ఎత్తుకొచ్చి, అరెస్టు చేసి జీపులో వేసి తీసుకెళ్లారు. అరెస్టు సమయంలో బండి సంజయ్ కూడా తీవ్రంగా ప్రతిఘటించారు.
బండి సంజయ్ అరెస్టు అనంతరం మరోసారి భారీగా కార్యకర్తలు ఎంపీ కార్యాలయం వద్దకు దూసుకురావడంతో నాలుగోసారి పోలీసులు లాఠీఛార్జి చేశారు. అంతకు ముందు పార్టీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కటకం మృత్యుంజయం, బొడిగె శోభతోపాటు పలువురు రాష్ట్ర, జిల్లా నాయకులు, కార్యకర్తలను అరెస్టు చేశారు. ఈక్రమంలో అక్కడికి చేరుకున్న మీడియా ప్రతినిధులు, జర్నలిస్టులు, పార్టీ నాయకులు, కార్యకర్తలకు తీవ్రగాయాలయ్యాయి.