అక్రమార్జన కేసుల్లో డీఎంకే మంత్రులు విడుదల కావడంపై మద్రాసు హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోందని, ఆ కేసులపై పునర్విచారణ ప్రారంభమైతే మంత్రులందరికీ జైలువాసమేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై స్పష్టం చేశారు.
రెండో విడద పాదయాత్రలో భాగంగా శనివారం మధ్యాహ్నం తేని జిల్లా కంభంలో జరిగిన భారీ ర్యాలీ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ కంభం ద్రాక్షపండ్లకు ప్రసిద్ధి చెందిందని, ఈ ద్రాక్షతోటల పెంపకాన్ని అభివృద్ధి పరచకుండా డీఎంకే ప్రభుత్వం రాష్ట్రమంతటా గంజాయి సాగు చేస్తోందని విమర్శించారు.
రాష్ట్రం కేరళకు చెందిన మందుల వ్యర్థాలను పారబోసే ప్రాంతంగా మారిందని, ముల్లై పెరియార్ డ్యాం నీటిమట్టం పెంచే విషయమై కేరళ ప్రభుత్వంతో స్టాలిన్ చర్చలు జరపలేకపోతున్నారని తెలిపారు. ఆ రాష్ట్రంలో డీఎంకే మిత్రపక్షమైన వామపక్షాలు అధికారంలో ఉండడమే దానికి కారణమని ఆరోపించారు.
డీఎంకే యువరాజు ఉదయనిధి సనాతన ధర్మం నిర్మూలించాలంటూ పిలుపునిస్తున్నారని, ఈ విషయంలో పట్టుదలగా ఉంటే తొలుత ఆయన తల్లిని ఆలయాలకు వెళ్లకుండా అడ్డుకోవాలని ఎద్దేవా చేశారు. డీఎంకే నేతలంతా సనాతన ధర్మానికి బద్ధశత్రువులని ప్రకటించుకోవడం అదే సమయంలో వారి కుటుంబీకులంతా ఆలయాలకు వెళ్లటం అలవాటేనని ధ్వజమెత్తారు.
కనుకనే మాజీ ముఖ్యమంత్రులు ఎంజీఆర్, జయలలిత డీఎంకేని దుష్టశక్తిగా విమర్శించారని బిజెపి నేత గుర్తు చేశారు. మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి తన జీవిత చరిత్రలో ఒకే దేశం ఒకే ఎన్నికలను సమర్థించారని, అలాంటప్పుడు ఈ ప్రతిపాదనను డీఎంకే నేతలు, ముఖ్యమంత్రి స్టాలిన్ వ్యతిరేకించడం గర్హనీయమని విమర్శించారు.
వచ్చే యేడాది జరుగనున్న లోక్సభ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి 400 స్థానాల్లో గెలిచి నరేంద్రమోదీ మరోసారి ప్రధాని పదవి చేపట్టడం ఖాయమని అన్నామలై భరోసా వ్యక్తం చేశారు.