బీఅరెస్ అవినీతి పాలనకు వచ్చే ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు చరమగీతం పాడుతారని బిజెపి ఎంపీ, ఓబిసి మోర్చా జాతీయ అధ్యక్షుడు డా. కె లక్ష్మణ్ స్పష్టం చేశారు. తెలంగాణలో నవంబర్ లేదా డిసెంబర్లో అసెంబ్లీ, మార్చి లేదా ఏప్రిల్లోలోక్ సభ ఎన్నికలు జరుగుతాయని చెప్పారు.
అయితే, జమిలీ ఎన్నికలు జరిపేందుకు సన్నాహాలు వేగంగా జరుగుతున్నాయని, ఎప్పుడు కార్యరూపం దాల్చుతాయో మాజీ రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ నివేదిక వచ్చాక స్పష్టత వస్తుందని తెలిపారు. ఆ నివేదికను పార్లమెంట్ ముంచి, అందరి అభిప్రాయాన్ని తీసుకొన్న తర్వాతనే నిర్ణయం ఉంటుందని తెలిపారు.
కేసీఆర్ యువతను ఆగం పట్టించి గారడీ చేస్తున్నాడని, నిరుద్యోగ యువత భవిష్యత్‌ను అంధకారంలో నెట్టారని ధ్వజమెత్తారు. 3 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉంటే వాటిని భర్తీ చేయకుండా 30 లక్షల మంది యువతను దగా చేశారని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో ఓటు అనే ఆయుధంతో కేసీఆర్‌కి యువత బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు.
నిరుద్యోగుల పక్షాన పోరాటాన్ని బీజేపీ ఉధృతం చేసిందని చెబుతూ 30 లక్షల మందికి నిరుద్యోగ భృతిని ఇవ్వలేదని, రాజకీయ కొలువుల భర్తీపై ఉండే శ్రద్ ఉద్యోగ భర్తీపై లేదని విమర్శించారు. పేపర్ లీకేజీ పేరుతో నిరుద్యోగ యువత జీవితాలతో సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఆడుకున్నారని దుయ్యబట్టారు.
మంత్రి కేటీఆర్ పేపర్ లీకేజీ అంశంలో రాజీనామా చేయకుండా ఒకరిద్దరిపై తప్పును నెట్టి తప్పించుకున్నారని ఆరోపించారు. 12వ తేదీన జాబ్ కాలెండర్ విడుదల, ఖాళీల భర్తీ చేయాలంటూ 24 గంటలపాటు దీక్ష చేపట్టనున్నామని తెలిపారు. 12వ తేదీన ఇందిరా పార్కు వేదికగా 11 గంటలకు దీక్ష ప్రారంభం అవుతుందని చెప్పారు. యువత పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చెయాలని పిలుపిచ్చారు.
ఉపాధ్యాయుల భర్తీలు చేపట్టక సర్కార్ బడులన్నీ మూసేసి స్థితికి తీసుకొచ్చారని డా. లక్ష్మణ్ ధ్వజమెత్తారు. చదువుకునే పరిస్థితి నుంచి చదువుకొనే పరిస్థితికి బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిందని విమర్శించారు. సెప్టెంబర్ 17వ తేదీన ప్రధానమంత్రి విశ్వకర్మ పథకాన్ని పేదప్రజాలకు కానుకగా ఇవ్వబోతున్నారని చెబతూ ‘‘ధన్యవాద్ మోడీజీ’’ పేరుతో బైక్ ర్యాలీలు నిర్వహిస్తాం’’ అని లక్ష్మణ్ తెలిపారు.
కాగా, మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు పేరు ఎఫ్ఐఆర్లో చేర్చకుండా అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని లక్ష్మణ్ తప్పుపట్టారు. చంద్రబాబు అరెస్ట్ సబబు కాదని స్పష్టం చేశారు.