బీజేపీ నుంచి ఎదురవుతున్న తీవ్ర ఎదురుదాడి నేపథ్యంలో సనాతన ధర్మంపై తమ వ్యాఖ్యల తీవ్రతను తగ్గించుకోవాలని డీఎంకే నాయకులను, తమిళనాడులోని మిత్రపక్షాలను తమిళనాడు ముఖ్యమంత్రి, డిఎంకె అధ్యక్షుడు ఎంకె స్టాలిన్ కోరారు. అయితే, ఈ విషయమై మరింతగా వాదించడం మరింత నష్టానికి దారితీస్తుందని భయంతో సనాతన ధర్మంపై ఏర్పడిన వివాదాన్ని కేంద్రంలోని మోదీ ప్రభుత్వం తన అవినీతిని, అక్రమాలను కప్పిపుచుకోవడానికి వాడుకుంటోందని అంటూ స్టాలిన్ ఆరోపించారు.
సనాతన ధర్మంపై తమిళనాడులోని నాయకులు చేస్తున్న విమర్శలు ప్రతిపక్ష ఇండియా యూటమిలోని భాగస్వామ్య పక్షాలు ముఖ్యంగా కాంగ్రెస్, టిఎంసి, శివసేనను ఆత్మరక్షణలోని నెట్టివేస్తున్నట్లు స్పష్టమైన నేపథ్యంలో స్టాలిన్ నుంచి ఈ ప్రకటన వెలువడడం గమనార్హం. డిఎంకెతోపాటు ఇండియా కూటమిలోని ఈ పార్టీలను హిందూ వ్యతిరేక పార్టీలు బిజెపి ముద్రవేస్తోంది.
ససనాతన ధర్మం చర్చనీయాంశం కావాలన్న ఉద్దేశంతోనే కేంద్ర మంత్రులు ఉద్దేశపూర్వకంగా ప్రతిరోజు దీనిపై మాట్లాడుతున్నారని, దేశాన్ని పట్టిపీడిస్తున్న అసలు సమస్యల నుంచి ప్రజలను పక్కదారి పట్టించడానికే వారు ఈ పనిచేస్తున్నారని స్టాలిన్ తాము లేవనెత్తిన అంశాలపై ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నం చేశారు.
బిజెపి చెబుతున్న అబద్ధాలను ప్రజల ముందు బట్టబయలు చేయాలని, తమ ప్రచారానికి అదే కేంద్ర బిందువు కావాలని చెప్పడం ద్వారా సనాతన ధర్మం గురించి ఇక వాదింపలేమని పరోక్షంగా అంగీకరించినట్లయింది. దేశాన్ని, ప్రజాస్వామ్య వ్యవస్థను కాపాడడమే ఏకైక లక్షంగా తాము కలసికట్టుగా ప్రయాణించాల్సిన అవసరం ఉందని అంటూ మేకపోతు గాంభీర్యం ప్రదర్శించే ప్రయత్నం చేశారు.