కరోనా నిబంధనలకు విరుద్ధంగా బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తన కార్యాలయంలో కరీంనగర్ లో తలపెట్టిన జాగరణ దీక్షను భగ్నం చేయడంలో అత్యుత్సాహం ప్రదర్శించిన పోలీసులు, బెయిల్ ఇవ్వడానికికి వీల్లేని నిబంధనలతో అరెస్ట్ చేయడం పట్ల విమర్శలు తలెత్తుతున్నాయి. కరోనా నిబంధనల అమలు కేవలం ప్రతిపక్షాల నిరసనలు అడ్డుకోవడానికేనా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ఒకే జిఓ ను అధికార పక్షంకు ఒక విధంగా, ప్రతిపక్షాలకు మరోవిధంగా పొలిసులు అమలు జరుపుతూ ఉండడంతో వారి రాజకీయ ఉద్దేశ్యాలతో వ్యవహరిస్తున్నట్లు స్పష్టం అవుతున్నది. రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్నాయని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని నిబంధనల్ని రూపొందించాయి. సభలు, సమావేశాలు, ర్యాలీలు పెట్టొదని ఆదేశించారు.
మాస్క్ తప్పనిసరని, భౌతిక దూరం పాటించాలని ఉత్తరువులు జారీ చేశారు. అయితే అధికార పార్టీ నేతలకు మాత్రం ఇటువంటి నిబంధనలు అమలు కాకపోవడం గమనార్హం. అధికారిక కార్యక్రమాల్లోనూ నిబంధనలకు మంగళమ్ పాడుతున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సహా మంత్రులు రూల్స్ ఫాలో కావడం లేదన్న ఆరోపణలున్నాయి.
డిసెంబర్ 29న సీఎం కేసీఆర్ నల్గొండ పర్యటనలో వందలాది మంది పాల్గొన్నారు. సీఎం కేసీఆర్ మాస్క్ కూడా పెట్టుకోలేదు. మాస్క్ లేకుంటే జరిమానాలు వేసే అధికారులు కూడా మాస్క్ మరిచిపోయారు.
మంత్రి కేటీఆర్ కూడా మాస్క్ లేకుండానే హైదరాబాద్ నగరంలో మిధాని ఫ్లైఓవర్, షేక్ పేట్ ఫైఓవర్ ప్రారంభోత్సవాలు, నల్గొండలో ఐటీ టవర్ కార్యక్రమంలో వందలాది మందితో కలసి పాల్గొన్నారు. నల్గొండలో కేటీఆర్ మాస్క్ లేకుండానే పెద్ద ర్యాలీలో పాల్గొన్నారు.
జిల్లాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా అంతే. మాస్క్ లు, భౌతిక దూరం ముచ్చట్లే ఉండడం లేదు. అయినా వారినెవ్వరు ప్రశ్నించడం లేదు. కనీసం మాస్క్ లు ధరించమని అక్కడే ఉన్న పోలీసులు కోరే ధైర్యం కూడా చేయడం లేదు.
అయితే పక్షాల నేతలకు మాత్రం అన్ని నిబంధనలు ఎదురొస్తాయన్న ఆరోపణలున్నాయి. బీజేపీ, కాంగ్రెస్ తో పాటు ఇతర విపక్షాల కార్యక్రమాలకు కరోనా నిబంధనల పేరుతో పోలీసులు బ్రేకులు వేస్తున్నారు.
సంజయ్ అరెస్ట్ పై నడ్డా ఆగ్రహం
బండి సంజయ్ అరెస్ట్ పై బిజెపి అధ్యక్షుడు జెపి నడ్డా ఆగ్రహం వ్యక్తం చేశారు. బండి సంజయ్ కార్యాలయంలోకి తెలంగాణ పోలీసులు ప్రవేశించి లాఠీ చార్జీ చేయడం తీవ్ర ఆక్షేపణీయమని ధ్వజమెత్తారు, సీఎం కేసీఆర్ ఆదేశాలతోనే పోలీసులు, బీజేపీ నేతలు, కార్యకర్తలపై హింసకు పాల్పడ్డారని మండిపడ్డారు.
ఆయన మంగళవారం సాయంత్రం హైదరాబాద్ లో అరెస్ట్ కు నిరసనగా బిజెపి నిర్వహిస్తున్న కొవ్వొత్తుల ర్యాలీలో పాల్గొంటున్నారు. మరోవంక, కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి కరీంనగర్ వెళ్లి జైలులో సంజయ్ ను పరామర్శిస్తున్నారు. సంజయ్ కు రిమాండు విధించిన 14 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు జరుపుతున్నట్లు రాష్ట్ర బిజెపి ప్రధాన కార్యదర్శి బంగారు శృతి తెలిపారు.
తెలంగాణ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ రాజ్యాంగ హక్కులను కాలరాస్తోందనడానికి ఇది మరొక ఉదాహరణ అని నడ్డా విమర్శించారు. శాంతియుతంగా చేస్తున్న ఈ దీక్షను చూసి కేసీఆర్ ప్రభుత్వం భయపడిందని, అందుకే ఈ దీక్షపై దాడి చేసి చెదరగొట్టాల్సిందిగా పోలీసులను ఆదేశించిందని విమర్శించారు.
తెలంగాణలో కొనసాగుతున్న రాజకీయ కక్షసాధింపు, అరాచకత్వానికి నిదర్శనంగా భారీ పోలీసు బలగాలతో పక్కా వ్యూహాంతో దాడికి పాల్పడ్డారని నడ్డా ఆరోపించారు. పోలీసులు ఇనుప గేట్లను ముందుగా కట్ చేసి, బలవంతంగా దీక్ష చేస్తున్న ప్రాంతానికి చేరుకున్న పోలీసులు వెంటనే బండి సంజయ్, ఆయన వెంటున్న నేతలు, కార్యకర్తలపై అమానుషంగా దాడికి పాల్పడి, అనంతరం అరెస్ట్ చేశారని ధ్వజమెత్తారు.
తెలంగాణలో బీజేపీకి పెరుగుతున్న ప్రజాదరణను చూసి కేసీఆర్ ప్రభుత్వం చాలా కలవరపడుతూ ఆందోళన చెందుతోందని, నైరాశ్యంలో ఉన్న కేసీఆర్ ప్రభుత్వం బీజేపీ నేతలు, కార్యకర్తలను టార్గెట్ చేస్తూ అమానవీయ, రాజ్యాంగ విరుద్ధమైన చర్యలకు పాల్పడుతోందని నడ్డా ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న ఇలాంటి అవమానకర, రాజ్యాంగ విరుద్ధ చర్యలకు బీజేపీ నేతలు, కార్యకర్తలు బెదిరే ప్రసక్తే లేదని కేసీఆర్ తెలుసుకోవాలని హెచ్చరించారు.
ప్రజావ్యతిరేక కేసీఆర్ ప్రభుత్వంపై పూర్తి స్థాయిలో తమ పోరాటాన్ని కొనసాగించాలని రాష్ట్ర బిజెపి నాయకులను కోరారు. ప్రజాస్వామ్య పద్ధతిలో బీజేపీ తన పోరాటాన్ని కొనసాగిస్తుందని, అప్రజాస్వామిక కేసీఆర్ ప్రభుత్వాన్ని కూకటివేళ్లతో పెకిలించిన తర్వాతే బీజేపీ విశ్రమిస్తుందని జేపీ నడ్డా స్పష్టం చేశారు.
బెయిల్ రాకుండా తప్పుడు కేసులు
పోలీసులు తప్పుడు కేసులు పెట్టి బండి సంజయ్ కు బెయిల్ రాకుండా చేశారని బీజేపీ అడ్వకేట్ కటకం మృత్యుంజయం విమర్శించారు. ఎవరిపై దాడి చేశారనే విషయం రిమాండ్ రిపోర్టులో లేదని పేర్కొన్నారు. ప్రభుత్వ ఉద్యోగిపై దాడి చేశారని 333 సెక్షన్ కింద తప్పుడు కేసు పెట్టారని మండిపడ్డారు.
బండి సంజయ్ బెయిల్ కోసం మంగళవారం హై కోర్టును ఆశ్రయిస్తామని తెలిపారు. జాగరణ దీక్ష సందర్భంగా బండి సంజయ్ సహా 16 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
వీరిలో ఐదుగురిని మాత్రమే కోర్టులు హాజరుపరిచిన పోలీసులు మిగతా వారు పరారీలో ఉన్నట్లు రిమాండ్ రిపోర్టులో తెలిపారు. బండి సంజయ్ కు బెయిల్ నిరాకరించిన కరీంనగర్ కోర్టు14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది.
పాత కేసులను కూడా కలిపి బండి సంజయ్ పై రిమాండ్ రిపోర్టులో పోలీసులు పేర్కొన్నారు. ఆదివారం నమోదైన కేసుతో పాటు మొత్తం 10 కేసులను చూపించారు. కరీంనగర్ టూ టౌన్ లో 2012లో ఒకే కేసులో 4 సెక్షన్లు నమోదు చేశారు. సిరిసిల్ల టౌన్ లో 2017లో ఒక కేసులో ఐదు సెక్షన్లు, ఇదే స్టేషన్ లో మరో కేసులో ఏడు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
2018లో కరీంనగర్ టూ టౌన్ లో ఒకే కేసులో ఆరు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కరీంనగర్ వన్ టౌన్ లో మూడు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అదే ఏడాది.. టూ టౌన్ లో రెండు సెక్షన్ల కింద మరో కేసు నమోదు అయింది. 2019లో బోయిన్ పల్లి పీఎస్ లో ఒకటి, మల్యాల పీఎస్ లో మరో కేసు నమోదు అయింది.
2019లో కరీంనగర్ లో రూరల్ పీఎస్ లో నాలుగు సెక్షన్ల కింద మరో కేసు నమోదైంది. ఆదివారం నాటి కేసుకు సంబంధించి డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ సహా మూడు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
బీజేపీ సోషల్ మీడియా విభాగం రాష్ట్ర కన్వీనర్ సతీశ్ చంద్రను హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. కొద్దిరోజులుగా సీఎం కేసీఆర్ కు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నాడన్న ఆరోపణలపై పోలీసులు సతీష్ చంద్రను అదుపులోకి తీసుకున్నారు.