కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. దీంతో ప్రస్తుతం జరుగుతున్నన ప్రత్యేక సమావేశాల్లో ఈ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నారు. దాదాపు అన్ని పార్టీలు ఈ బిల్లుకు మద్దతు పలుకుతున్న నేపథ్యంలో ఈ బిల్లు పెద్దగా ఇబ్బందులు లేకుండానే పార్లమెంట్ మద్దతు పొందే అవకాశం ఉంది.
ఐదు రోజుల పాటు జరిగే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదించాలని ప్రతిపక్ష పార్టీలు అఖిలపక్ష సమావేశంలో డిమాండ్ చేశాయి. ఆదివారం పార్లమెంట్‌లోని లైబ్రరీ భవన్లో కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టాలని మెజార్టీ రాజకీయ పార్టీలు బలంగా లేవనెత్తాయి.
దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న బిల్లును ప్రవేశపెట్టాలని, ఏకాభిప్రాయంతో ఆమోదం పొందేలా చూడాలని వివిధ పార్టీల నేతలు కోరారు. పురుషుల ఆధిపత్యం ఎక్కువ కావడం, మహిళల ప్రాధాన్యత తగ్గుతూ ఉండటంతో మహిళా రిజర్వేషన్ బిల్లుకు ప్రాధాన్యత పెరిగింది. లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీల్లోని మొత్తం సీట్లలో 33శాతం లేదా మూడింట ఒక వంతు మహిళలకు రిజర్వ్ చేయాలని మహిళా రిజర్వేషన్ బిల్లు ముఖ్య ఉద్దేశ్యం.
33శాతం కోటాలో ఎస్సీ, ఎస్టీలు, ఆంగ్లో-ఇండియన్ల సబ్ రిజర్వేషన్లను కూడా బిల్లు ప్రతిపాదిస్తుంది. ప్రతి సార్వత్రిక ఎన్నికల తర్వాత రిజర్వ్డ్ సీట్లను మార్చాలని బిల్లు ప్రతిపాదిస్తోంది.
చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించాలని సుదీర్ఘమైన పోరాటం జరిగింది. ఈ బిల్లును 1996లో హెచ్డీ దేవెగౌడ ఆధ్వర్యంలోని యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వం ముందుగా లోక్‌సభలో ప్రవేశపెట్టింది. అనంతరం వాజ్‌పేయ్, మన్మోహన్ సింగ్ ప్రభుత్వాల హయాంలోనూ మహిళా రిజర్వేషన్ బిల్లు లోక్ సభ ఆమోదానికి నోచుకోలేదు.
చివరకు మహిళా రిజర్వేషన్ బిల్లు 2010లో రాజ్యసభ ఆమోదం పొందింది. అయితే లోక్‌సభలో బిల్లు పెండింగ్ లో ఉండిపోయింది. 2014లో లోక్‌సభ రద్దుకావడంతో బిల్లు ఆగిపోయింది. తాజాగా ప్రధాని మోదీ సారథ్యంలోని కేంద్ర కేబినెట్ మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఆమోదం తెలిపింది. ఉభయ సభల్లో ఎన్డీఏకు మెజార్టీ ఉండడంతో ఇప్పటికైనా ఈ బిల్లు ఉభయ సభల్లో ఆమోదం పొందే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.