ప్రఖ్యాత నటుడు అక్కినేని నాగేశ్వరరావు శతజయంతి ఉత్సవాలను హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు బుధవారం ప్రారంభించారు. అనంతరం అక్కినేని నాగేశ్వరరావు విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అక్కినేనితో తనకు ఉన్న అనుబంధాన్ని వెంకయ్య నాయుడు గుర్తుచేసుకున్నారు.
‘నాకు నాగేశ్వరరావు అంటే చాలా అభిమానం. ఈ విగ్రహంలో జీవకళ ఉట్టిపడుతోంది. ఆయనే నిల్చున్నారా అనేలా ఉంది. ఏఎన్నార్ మహానటుడు. అలాగే గొప్ప వ్యక్తిత్వం ఉన్న మహా మనిషి. నేను, ఆయన అనేక విషయాలపై మాట్లాడుకునే వాళ్లం. ఆఖరి రోజు వరకూ నటించిన నటుడు నాకు తెలిసి మరొకరు లేరు. సినిమా రంగంలో విలువలు పాటించిన వ్యక్తి నాగేశ్వరరావు’ అంటూ కొనియాడారు.
ఆయన చూపిన మార్గంలో ప్రయాణించడం ఆయనకు మనమిచ్చే నివాళి అని పేర్కొన్నారు. అక్కినేని నుండి స్ఫూర్తి పొంది కొంతైనా అందరూ అమలు పరిస్తే వారి జీవితాలు బాగుంటాయని వెంకయ్య నాయుడు తెలిపారు. ఇప్పుడు వస్తున్న సినిమాల్లో అశ్లీలం, రెండర్థాల భావాలు ఉంటున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తూ తెలుగు భాషని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని గుర్తుచేశారు.
‘భాష పోతే శ్వాస పోతుంది, శ్వాస పోతే, అసలే పోతుంది అందుకే భాషని ఎప్పుడూ మరచిపోకూడదు. భాష పోతే సినిమా ఉండదు, భాషా పత్రికలూ వుండవు, ఛానళ్ళు వుండవు, భాషని కాపాడుకోవాలి, జీవితంలో అదొక అలవాటుగా, పట్టుదలగా భాషను కాపాడుకోవాల్సి వుంది, దానికి మనం ఏమీ కష్టపడాల్సిన పనిలేదు, మన భాషలో మాట్లాడితే చాలు’ అని సూచించారు.
ఈ కార్యక్రమంలో సినీ ప్రముఖులు మహేష్‌బాబు, నమ్రతా శిరోద్కర్, రామ్ చరణ్, మోహన్ బాబు, ఎస్ఎస్ రాజమౌళి, ఎం.ఎం. కీరవాణి, అల్లు అరవింద్, అశ్వినీదత్, దిల్ రాజు, మురళీమోహన్, సుబ్బరామిరెడ్డి, నాని, మంచు విష్ణు, జగపతిబాబు, రాజేంద్రప్రసాద్, శ్రీకాంత్, జయసుధ, బ్రహ్మానందం, సి కళ్యాణ్, చినబాబు, నాగవంశీ, ఎస్ గోపాల్ రెడ్డి, వైవిఎస్ చౌదరి, జెమిని కిరణ్, గుణ్ణం గంగరాజు, అనుపమ్ ఖేర్, నాజర్ తదితరులు పాల్గొని అక్కినేని నాగేశ్వరరావుకు ఘనంగా నివాళులర్పించారు.