కర్ణాటకలో గత కొన్ని రోజులుగా తలెత్తిన సస్పెన్స్‌కు ఎట్టకేలకు ముగింపు లభించింది. ఇటీవల కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాభవాన్ని మూటగట్టుకున్న జనతాదళ్ సెక్యులర్ -జేడీఎస్ పార్ 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ కూటమిలో చేరింది.
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆధ్వర్యంలో ఢిల్లీలో జరిగిన సమావేశంలో ఎన్డీఏలో చేరుతున్నట్లు జేడీఎస్ నేత, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామి ప్రకటించారు. ఈ సమావేశంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ కూడా పాల్గొన్నారు.
కేంద్రమంత్రి అమిత్ షా నివాసానికి వెళ్లి సమావేశమైన హెచ్డీ కుమారస్వామి ఆయనకు శాలువా కప్పారు. ఈ సందర్భంగా జేపీ నడ్డా, అమిత్ షా, కుమారస్వామి కలిసి కొద్దిసేపు భేటీ అయ్యారు.
ఈ సందర్భంగా పొత్తులు, లోక్‌సభ ఎన్నికల్లో ఇరు పార్టీల మధ్య కర్ణాటకలో సీట్ల పంపిణీ విషయంలో వీరు ముగ్గురు చర్చించినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. అయితే ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నందున ఇప్పటికైతే సీట్ల సర్దుబాటుపై ఎలాంటి నిర్ణయం తీసుకున్నారు అనేది ప్రశ్నార్థకంగానే ఉంది. ఎన్డీఏలో జేడీఎస్ చేరిందని ఈ భేటీ తర్వాత బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా ట్విటర్ వేదికగా వెల్లడించారు.
కేంద్రమంత్రి అమిత్ షా సమక్షంలో కర్ణాటక మాజీ సీఎం, జేడీఎస్ నాయకుడు హెచ్డీ కుమారస్వామి అధికార కూటమిలో చేరారని వెల్లడించారు. ఎన్డీఏలో చేరాలని జేడీఎస్ నిర్ణయించుకున్నందుకు చాలా సంతోషంగా ఉందని కుమారస్వామిని మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నామని చెప్పారు. ఈ చేరికతో న్యూ ఇండియా.. స్ట్రాంగ్ ఇండియా అనే ప్రధాని నరేంద్ర మోదీ విజన్ మరింత బలపడుతుందని పేర్కొన్నారు.