కెనడా-భారత్ వివాదంలో అగ్రరాజ్యం అమెరికా నెమ్మదిగా స్వరం మారుస్తున్నది. ఇరుదేశాల మధ్య పరిస్థితులను సమీక్షిస్తున్నట్టు ఇటీవల పేర్కొన్న అమెరికా తాజాగా కెనడా వైపు మొగ్గుచూపుతున్నట్టు తెలుస్తున్నది. విచారణలో భారత్‌కు ఎటువంటి మినహాయింపులు ఉండవని అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జాక్ సలివాన్ తెలిపడం చర్చనీయాంశంగా మారింది.
మరోవైపు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సైతం నిజ్జర్ హత్య అంశాన్ని ప్రధాని మోదీ వద్ద ప్రస్తావించినట్టు తెలుస్తున్నది. దీంతో అమెరికా స్వరం మారుస్తున్నట్టు విశ్లేషకులు భావిస్తున్నారు. కెనడా-భారత్ మధ్య నెలకొన్న వివాదంపై సలివాన్ స్పందించారు. ‘భారత దౌత్యవేత్తలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నాం. భారత్‌కు ప్రత్యేకమైన మినహాంపులు ఏం ఉండవు. కెనడాతో మాకు విభేదాలు లేవు. కెనడాతోనూ సంప్రదింపులు జరుపుతున్నాం. ప్రాథమిక సూత్రాలకు కట్టుబడి ఉంటాం’ అని ఆయన పేర్కొన్నారు.
జీ20 సమావేశాల్లో పాల్గొనేందుకు భారత్‌కు వచ్చిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ నిజ్జర్ హత్య అంశాన్ని ప్రధాని మోదీతో భేటీలో ప్రస్తావిచించినట్టు బ్రిటన్ పత్రిక ఒకటి వెల్లడించింది. జో బైడెన్‌తో పాటు ఫైవ్ ఐలో ఉన్న ఇతర దేశాల నేతలు కూడా మోదీ వద్ద ఈ అంశాన్ని లేవనెత్తినట్టు బ్రిటన్ పత్రిక ఫైనాన్షియల్ టైమ్స్ పేర్కొంది.
మరోవంక, ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య వెనుక భారత హస్తం ఉన్నట్టు పక్కా సాక్ష్యాధారాలతోనే కెనడా ఆరోపణలు చేస్తున్నట్టు ఆ దేశ మీడియా ప్రచారం చేస్తున్నట్లు ఈ మేరకు సీబీఎస్ న్యూస్ వెల్లడించింది. అందుకే దౌత్యపరమైన సంబంధాలను కూడా లెక్కచేయకుండా ఆయన భారత్‌వైపు వేలు చూపారని ఆ కథనంలో పేర్కొంది.
నిజ్జర్ హత్య వెనుక భారత హస్తం ఉన్నట్టు ఫైవ్ ఐ నెట్‌వర్క్‌లోని ఓ దేశానికి చెందిన ఇంటెలిజెన్స్ వర్గాలు కెనడాకు ఆధారాలు అందించినట్టు ఆ పత్రిక తెలిపింది. కెనడా వద్ద హ్యూమన్, సిగ్నల్ ఇంటెలిజెన్స్‌కు సంబంధించిన సాక్ష్యాలు ఉన్నట్టు కెనడా ప్రభుత్వ ప్రతినిధులు కూడా ధ్రువీకరించినట్టు పేర్కొంది. భారత దౌత్య అధికారుల సంభాషణలు కూడా ఉన్నట్టు తెలిపింది.
మరోవైపు విచారణకు హాజరుకావాలని భారత అధికారులను కెనడా కోరినట్టు వెల్లడించింది. కెనడా నేషనల్ సెక్యూరిటీ, ఇంటెలిజెన్స్ అడ్వైజర్ థామస్ ఆగస్టు, సెప్టెంబర్‌లో భారత్‌లో పర్యటించారని పేర్కొంది. ఈ ఆరోపణలను భారత దౌత్యవేత్తలు ఖండించలేదని వివరించింది.
అయితే, భారత్‌తో వివాదంలో తలమునకలైన ట్రూడోకు గట్టి షాక్ తగిలింది. ఈ వివాదం కారణంగా ఆ దేశంలో ట్రూడో పాపులారిటీని గణనీయంగా కోల్పోయారు. సుమారు 60 శాతం మంది ఆయన ప్రధాని పదవి నుంచి దిగిపోవాలని కోరుకుంటున్నారని గ్లోబల్ న్యూస్ అనే సంస్థ నిర్వహించిన సర్వేలో తేలింది. అదే సమయంలో ప్రతిపక్ష నేత పియరీకి జనాధరణ పెరుగుతున్నది. 40 శాతం మంది పియరీ ప్రధాని కావాలని కోరుకుంటున్నారు.
మరోవంక, ఈ వివాదం కారణంగా కెనడాలో విద్యనభ్యసించేందుకు వెళ్లిన భారతీయులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే తినడానికి తిండి లేకపోవడంతో బ్రెడ్ తింటూ కాలం వెళ్లదీస్తున్నారు. మరోవైపు ఉండేందుకు ఇల్లు కూడా లేకపోవడంతో రోడ్లపైను పడుకుంటున్నారు. 2022లో అత్యధికంగా 2,26,450 మంది విద్యార్థులు కెనడాకు వెళ్లారు వీరందరికీ వసతి కల్పించడంలో అక్కడి వర్సిటీలు విఫలమవుతున్నాయి. దీంతో చెట్ల కింద, టెంట్లు వేసుకొని ఉండాల్సిన దుస్థితి తలెత్తింది. మరోవైపు అష్టకష్టాలు పడి చదువు పూర్తి చేసిన వారికి ఉద్యోగాలు దొరక్క ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కెనడాతో ఉద్రిక్తతల నేపథ్యంలో భారతీయ విద్యార్థుల కష్టాలు మరింత పెరిగాయి.