దేశంలో కరోనా ఉధృతమవుతున్నది. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కరోనాబారిన పడ్డారు.
అరవింద్ కేజ్రీవాల్‌కు మంగళవారం ఉదయం కొవిడ్-19 పాజిటివ్ అని తేలింది. దీంతో తాను ఇంట్లో ఐసోలేషన్ లో ఉన్నానని సీఎం కేజ్రీవాల్ చెప్పారు.‘‘నాకు కొవిడ్ పాజిటివ్ అని తేలింది.కరోనా తేలికపాటి లక్షణాలుండటంతో ఇంట్లోనే ఐసోలేషన్‌లో ఉన్నాను. గత కొన్ని రోజులుగా నన్ను కలిసిన వారు మీరు ఐసోలేషన్‌లో ఉండండి. మీరు కరోనా పరీక్షలు చేయించుకోండి’’ అని కేజ్రీవాల్ ట్వీట్ చేశారు.
ఆదివారం నుంచి జ్వరంతో బాధపడుతున్న రేవంత్ రెడ్డి పరీక్షలు చేయించుకోగా వైరస్ నిర్ధారణ అయింది. కొవిడ్ లక్షణాలు స్వల్పంగానే ఉన్నాయని, కొన్ని రోజుల నుంచి తనను కలిసినవారు టెస్టులకు వెళ్లాలని రేవంత్ ట్వీట్ చేశారు. రేవంత్ గతంలోనూ ఒకసారి కరోనా బారినపడ్డారు. తాజాగా పాజిటివ్‌గా నిర్ధారణ నేపథ్యంలో మంగళ, బుధవారాల్లో జరిగే పార్టీ సమావేశాల్లో జూమ్ యాప్ ద్వారా పాల్గొననున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
నెల్లూరు జిల్లా శ్రీహరికోటలో 14 మంది కోవిడ్ బారినపడ్డారు. శ్రీహరికోట సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రంలో ఇద్దరు వైద్యులు, 12 మంది ఉద్యోగులు కరోనా బారినపడగా వారి శాంపిల్స్‌ను జీనోమ్ సీక్వెన్సింగ్ ల్యాబ్‌కు పంపించారు.
అంతరిక్ష కేంద్రంలో పనిచేస్తున్న మిగతా ఉద్యోగులకు కూడా పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో.. షార్ అధికారులు ప్రత్యేక మార్గదర్శకాలను విడుదల చేశారు. బయో మెట్రిక్ స్థానంలో అటెండెన్స్ రిజిస్టర్లను ఏర్పాటు చేశారు. ఉద్యోగులు, వైద్యులకు కరోనా సోకడంతో ఈనెల చివరి వారంలో నిర్వహించాల్సిన రీ శాట్ ఉపగ్రహ ప్రయోగం వాయిదా పడే అవకాశం ఉంది.
కొత్త సంవత్సరం సందర్భంగా గోవాకు టూరిస్టులు వేలాదిగా వచ్చారు. ఆంక్షలున్నా సరే బీచ్‌లు, పబ్‌లు, నైట్ క్లబ్బులకు పోటెత్తారు. దీంతో గోవాలో కరోనా కేసుల పాజిటివిటీ రేటు ఆదివారం 10.7 శాతంగా నమోదైంది. గత 24 గంటల్లో 388 మంది వైరస్ బారిన పడినట్లు ఆరోగ్య శాఖ సోమవారం తెలిపింది.
ప్రస్తుతం 1,671 యాక్టివ్ కేసులు ఉన్నట్లు చెప్పింది. దీంతో గోవా సర్కారు నైట్ కర్ఫ్యూ విధించింది. స్కూళ్లు, కాలేజీలను ఈనెల 26వ తేదీ దాకా మూసేయాలని ఆదేశాలిచ్చింది.
పంజాబ్ రాష్ట్రంలోని పాటియాలా మెడికల్ కళాశాలలో 100 మంది వైద్య విద్యార్థులకు కరోనా పాజిటివ్ అని తేలింది. పాటియాలా,పఠాన్ కోట్ నగరాల్లో కరోనా పాజిటివిటీ రేటు 4.47 శాతానికి చేరింది. వైద్యకళాశాలలో కొవిడ్ వ్యాప్తితో హాస్టళ్లలో ఉన్న విద్యార్థులు తక్షణం గదులు ఖాళీ చేయాలని కళాశాల యాజమాన్యం ఆదేశించింది.
కరోనా కేసులు వెలుగుచూడటంతో పఠాన్ కోట్ నగరంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలను మూసివేశారు. గత 6 రోజులుగా పంజాబ్ రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతుండటంతో ఆందోళన వ్యక్తమవుతోంది.
థాపర్ యూనివర్శిటీని ముందుజాగ్రత్తగా మూసివేశారు. పాటియాలాలో 502 కేసులు పఠాన్ కోట్ లో 298 కరోనా కేసులు వెలుగుచూశాయి.కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండటంతో మంగళవారం సీఎం సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. భటిండాలోని ఆదేశ్ యూనివర్శిటీలో విద్యార్థులకు కూడా కరోనా సోకింది.
గడిచిన 24 గంటల్లో భారత్‌లో కొత్తగా 37,379 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 11,007 మంది కరోనా నుంచి కోలుకున్నారు. 124 మంది కరోనాతో మృతి చెందారు. యాక్టివ్ కేసుల సంఖ్య 1,71,830కి చేరింది. కరోనా రోజువారీ పాజిటివీటి రేటు 3.24 శాతంగా నమోదైంది.